- కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులు
- బాల్క సుమన్ ఇసుక దందాతో వందల కోట్లు సంపాదించిండు
- మంత్రి వివేక్ వెంకటస్వామి
- క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినా ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుందని వెల్లడి
కోల్ బెల్ట్: పదేండ్ల పాటు అధికారంలో ఉండి బీఆర్ఎస్ చేసిందేమిటో చెప్పాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లు కమీషన్ల కోసమేనని విమర్శించారు.
శుక్రవారం (జనవరి 16) ఆయన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.45 కోట్ల టీయూఐఎఫ్టీసీ, సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన నిరంకుశ పాలన వల్ల రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపించారు. ఖాజానా ఖాళీ అయినప్పటికీ గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. సోమనపల్లి గ్రామంలో రూ.250కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందన్నా రు.
మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్ని పాలిటీలలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. చెన్నూరు నియోజక వర్గం లో 100 కోట్లతో అమృత్ స్కీమ్ పథకంద్వారా చెన్నూరు, మందమర్రి, క్యాతన పల్లి మున్సిపాలిటీలకు స్వచ్ఛమైన నీరు అందించేందు కు పనులు జరుగుతున్నాయని, మరో ఆరు నెలల్లో ఇంటింటికి తాగునీరు అందిస్తామని వివరించా రు. కేసీఆర్ చిన్న కొడుకు అని చెప్పుకునే బాల్క సుమన్ ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడలేదని, ఇసుక దందాతో వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
