ప్రపంచవ్యాప్తంగా ప్రిడిక్షన్ మార్కెట్‌గా గుర్తింపు పొందిన 'పాలీమార్కెట్'లో ఒక ట్రేడర్ చేసిన సాహసం కోలుకోలేని దెబ్బ తీసింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం వస్తుందని, ముఖ్యంగా జనవరి 14 అర్ధరాత్రి లోపే అమెరికా సైనిక దాడి చేస్తుందని నమ్మి భారీగా బెట్టింగ్ కట్టిన ఆ ట్రేడర్.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే రూ.36 లక్షలకు పైగా లాస్ అయ్యాడు. యుద్ధం జరగకపోవడంతో ఆ ట్రేడర్ పెట్టిన పెట్టుబడి మొత్తం సున్నా అయిపోయింది.
సాధారణంగా ట్రేడర్లు తమ పెట్టుబడిని వివిధ రకాల బెట్టింగ్‌లలో విభజించి హెడ్జింగ్ చేస్తుంటారు. కానీ ఈ ట్రేడర్ మాత్రం కొత్త ఖాతాను తెరిచి, కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే డజన్ల కొద్దీ బెట్లను ఒకే అంశంపై వేశాడు అదే ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మీద. అది కూడా జనవరి 14 గడువు లోపు అమెరికా దాడి చేయడం ఖాయమని అతను బలంగా నమ్మాడు. అయితే ఆ సమయానికి ఎలాంటి సైనిక చర్య జరగకపోవడంతో.. అతను కొనుగోలు చేసిన కాంట్రాక్టులు విలువ సున్నా అయిపోయింది. అంచనాలు తలకింతులు కావటంతో చివరికి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాడు సదరు ట్రేడర్.
ఎందుకు ఇలా జరిగింది..?
ప్రిడిక్షన్ మార్కెట్లు వాస్తవ ప్రపంచంలో జరిగే సంఘటనల ఆధారంగా పనిచేస్తాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న మాట వాస్తవమే. అయితే జూన్ 30, 2026లోపు యుద్ధం జరిగే అవకాశం 55 శాతం ఉందని మార్కెట్ అంచనా వేస్తోంది. కానీ నష్టపోయిన ట్రేడర్ మాత్రం కేవలం జనవరి 14నే గడువుగా పెట్టుకోవడం దెబ్బతీసింది. రాజకీయ వ్యూహాలు, దౌత్య చర్చలు, సైనిక సన్నద్ధత వంటివి మార్కెట్ అంచనాల ప్రకారం జరగవు. ఒక ట్రేడర్ యుద్ధం జరుగుతుందని ఊహించడంలో కరెక్ట్ అయినా.. అది ఎప్పుడు జరుగుతుందనే 'టైమింగ్' విషయంలో పొరపాటయితే పెట్టుబడి మొత్తం ఆవిరౌతుందని ఈ ఘటన ఫ్రూవ్ చేసింది.
పాలీమార్కెట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఎన్నికలు, యుద్ధాలు, విధాన నిర్ణయాలపై ప్రజల అభిప్రాయాలకు అద్ధం పడుతుంటాయి. ఇవి కేవలం సెంటిమెంట్‌ను మాత్రమే చూపుతాయి కానీ.. ఖచ్చితత్వాన్ని కాదు. ఉన్నత స్థాయి అమెరికా అధికారుల హెచ్చరికలు, మీడియా స్టోరీల్లోని హైప్ చూసి మార్కెట్‌లో ట్రేడింగ్ వేగంగా జరుగుతుంటుంది. ఈ ట్రేడర్ విషయంలో కూడా కేవలం ఊహాగానాలనే నమ్మి, ఎటువంటి హెడ్జింగ్ అంటే నష్టాలను తట్టుకునే ప్లానింగ్ లేకుండా సదరు ట్రేడర్ మొత్తం డబ్బును ఒకే చోట పెట్టడం కొంపముంచింది.
ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. భౌగోళిక రాజకీయాలు కౌంట్‌డౌన్ టైమర్ల ప్రకారం జరగవని.. ఇలాంటి సున్నితమైన అంశాలపై బెట్టింగ్‌లు కట్టడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూ.36 లక్షల నష్టం అనేది ప్రిడిక్షన్ మార్కెట్‌లో రిస్క్ మేనేజ్‌మెంట్ ఎంత ముఖ్యమో నిరూపించే చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. సో ట్రేడర్స్ మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందైనా సరైన ప్లానింగ్, ప్లాన్ రివర్స్ అయితే వచ్చే నష్టాలను ఎదుర్కోవటానికి హెడ్జింగ్ కూడా ముఖ్యమేనని గుర్తుంచుకోండి.
