వనపర్తి జిల్లాలో యథేచ్ఛగా సీఎంఆర్ ఎగవేత!..

వనపర్తి జిల్లాలో యథేచ్ఛగా సీఎంఆర్ ఎగవేత!..
  •  సీఎంఆర్​ను పక్కదారి పట్టిస్తున్న మిల్లర్లు
  •  గడువు విధించినా ఫలితం లేదు
  •  పట్టించుకోని అధికారులు

వనపర్తి, వెలుగు : జిల్లాలో రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఎంఆర్)ను యథేచ్ఛగా ఎగవేస్తున్నారు. దీని వల్ల చాలా మంది మిల్లర్లు డీఫాల్టర్లుగా మారారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లా కేంద్రం శివారులోని చిట్యాల మిల్లులో అధికారులు తనిఖీ చేసినప్పుడు సీఎంఆర్​ అమ్ముకుని దాని స్థానంలో పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేసి విషయం వెలుగు చూసింది. 

టెక్నికల్​అసిస్టెంట్​తో క్వాలిటీ చెక్​ చేయగా, పీడీఎస్ బియ్యం బయటపడ్డాయి. పెద్దమందడి మండలం మోజర్లలో రెండు రైస్​మిల్లులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయగా, మొత్తం 1,44,000 బస్తాల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.13.67 కోట్లు ఉంటుంది. ఖిల్లాగణపురం మండలంలోనూ ఓ డీఫాల్టర్ ఇతర మిల్లు పేరు మీద సీఎంఆర్ పొందాడు. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలానే ఉన్నా.. కొన్ని మాత్రమే బయటపడ్డాయి. 

గడువు విధించినా ఫలితం లేదు..

పెండింగ్ సీఎంఆర్ వెంటనే చెల్లించాలని జిల్లా ఉన్నతాధికారులు పలుమార్లు మీటింగ్స్ పెట్టి మిల్లర్లకు గడువు విధిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సివిల్ సప్లయ్​శాఖ సీఎంఆర్ కోసం ఇచ్చిన వరి ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించి రేషన్​ బియ్యాన్ని సీఎంఆర్​గా చూపిస్తున్నారు. మరికొందరు ఇతర జిల్లాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి మరాడిస్తున్నారు. పది రోజుల కింద శ్రీరంగాపూర్​లో ఒక రైస్​మిల్లును అధికారులు తనిఖీ చేయగా, 240 బస్తాల ధాన్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదేంటని అధికారులు ప్రశ్నించగా, గద్వాల జిల్లాలోని ఓ మిల్లు నుంచి తెచ్చి మిల్లింగ్ చేస్తున్నట్లు మిల్లర్ చెప్పడం గమనార్హం. 

నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు..

జిల్లాలో మిల్లర్లు సీఎంఆర్ కింద తీసుకున్న వరి ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు అమ్ముకుని ప్రభుత్వానికి పెండింగ్ పెడుతున్నారు. అంతేకాకుండా తమ మిల్లింగ్ పరిమితికి మించి అదనపు కేటాయింపులు చేయించుకుని సీఎంఆర్ సకాలంలో ఇవ్వడం లేదు. తనిఖీ కోసం అధికారులు వచ్చినప్పుడు కేసులు కాకుండా శాఖలోని కొందరు మిల్లర్లకు సహకరిస్తుండడంతోనే వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

సగం మందికే కేటాయింపులు..

జిల్లాలో 170 వరకు రైస్ మిల్లులుంటే.. ఖరీఫ్​లో 70 మందికి సీఎంఆర్​ అనుమతులు ఇచ్చారు. అది కూడా బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వారికే మాత్రమే. సీఎంఆర్​కు అర్హత పొందిన వారిలోనూ కొందరు మిల్లర్లు ఇంకా గ్యారంటీలు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారు. కలెక్టర్​ ప్రతి సమావేశంలో బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం కేటాయిస్తామని చెప్పడంతో మిల్లర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌023–-24 ఖరీఫ్​లో 90 శాతం మిల్లర్లు సీఎంఆర్​ఇచ్చారని, అదే రబీలో 40 శాతమే ఇచ్చారని, 9 మంది మిల్లర్లు డీఫాల్టర్లుగా గుర్తించినట్లు సివిల్ సప్లయ్​డీఎం జగన్మోహన్​ తెలిపారు.