రూ.5 కోట్లు పెట్టినా అక్కర రాలే!..ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం డంప్ యార్డుకు ఎసరు

రూ.5 కోట్లు పెట్టినా అక్కర రాలే!..ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం డంప్ యార్డుకు ఎసరు
  • రూ.5 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు నిరుపయోగం
  • బెల్లంపల్లిల శాశ్వత డంప్ యార్డు లేక తిప్పలు 
  • రోడ్లపై చెత్త పారబోతతో కంపు కొడుతున్న కాలనీలు 

బెల్లంపల్లి, వెలుగు:  ప్రభుత్వ అధికారులు తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్​ను మంజూరు చేసింది. ఇందు కోసం దాదాపు రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పటి జిల్లా అధికారులు ఆగమేఘాల మీద వివిధ సర్వే నంబర్లలో 253 ఎకరాల ప్రభుత్వ భూములను సేకరించారు. ఇందులో భాగంగా అప్పటికే డంపింగ్ యార్డుకు కేటాయించిన 10 ఎకరాల భూమిని సైతం తీసుకున్నారు.

నిరుపయోగంగా డంప్ యార్డ్ 

బెల్లంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని చెత్తను సేకరించి, దాన్ని రీసైక్లింగ్ చేయడానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. రూ.5 కోట్లకు పైగా వెచ్చించి రోడ్లు, వివిధ అవసరాలకు బిల్డింగులు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. ఇందుకు 13, 14వ ఆర్థిక సంఘం నిధులు, ఇతర ఫండ్స్​ను వినియోగించారు. ఈ పనులన్నీ 2021 వరకు కొనసాగుతుండగానే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం డంప్ యార్డు భూమిని ప్రభుత్వం తీసుకుంది. దీంతో కోట్లు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా ఉన్నాయి.

వెచ్చించిన నిధులు ఇలా...

డంపింగ్ యార్డుకు రూ.కోటి వరకు వెచ్చించి పాలిటెక్నిక్ కాలేజీ నుంచి సిమెంట్ రోడ్డు, కల్వర్టులు నిర్మించారు. రూ.50 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తిచేశారు. రూ.15 లక్షలతో పాత వర్మీ కంపోస్ట్ షెడ్డుకు రిపేర్లు చేశారు. కొత్తగా రూ.40 లక్షలతో వర్మీ కంపోస్ట్ షెడ్డు, రూ.20 లక్షలతో బయోవేస్ట్ ప్లాంట్, రూ.35 లక్షలతో డీఆర్సీసీ కేంద్రం, వాచ్​మెన్​ షెడ్డు, ఆఫీస్ రూమ్ 
నిర్మించారు. 

నీటి కోసం బోర్లు వేశారు. కరెంట్ సప్లై కోసం ఏర్పాట్లు చేశారు. ఈ పనులకు రూ.లక్షల్లో ఖర్చు చేశారు. డంప్​యార్డ్​ ఏర్పాటుకు రూ.కోట్లలో ఖర్చు చేసిన అధికారులు.. ఈ పనులను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఫుడ్ ​ప్రాసెసింగ్ జోన్ కోసం భూ సేకరణకు పట్టుబట్టారు. దీంతో అక్కడ చేపట్టిన నిర్మాణాలన్నీ నిరుపయోగంగా మారాయి. 

రోడ్లపైనే చెత్త

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్​యార్డు కోసం ఇప్పటికీ శాశ్వత ఏర్పాట్లు లేకపోవడంతో చెత్త వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త పారబోస్తుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గోల్​బంగ్లా బస్తీ, ఇతర ప్రాంతాల్లో చెత్తను వేయడంతో పట్టణ పరిసరాలన్నీ కంపు కొడుతున్నాయి. చెత్తను ఇష్టారీతిన కాల్చేయడం వల్ల  విషవాయువులు వెలువడి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. 

అధికారుల అనాలోచిత నిర్ణయాల పుణ్యమాని రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు నిరుపయోగంగా మారగా.. ఆర్భాటంగా ప్రకటించిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ సైతం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఫలితంగా కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కావడమే కాకుండా చేపట్టిన నిర్మాణాలకు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డును వినియోగంలోకి తీసుకొస్తే బెల్లంపల్లిలో చెత్త కష్టాలను తీర్చవచ్చు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.