- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పం
- 14 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే రికార్డు
- 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో ఇగం మరింత ముదురుతున్నది. రాష్ట్రమంతటా చలిగాలులు వీస్తున్నాయి. దాని ప్రభావంతో రాత్రి టెంపరేచర్లు దారుణంగా పడిపోతున్నాయి. సోమవారం రాత్రి అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే టెంపరేచర్లు నమోదయ్యాయి. అయితే, మరో రెండ్రోజుల్లో చలి తీవ్రత తగ్గే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొన్నది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నదని, ఆ తర్వాత రెండు రోజులకు అది మరింత బలపడుతుందని తెలిపింది. దాని ప్రభావంతో చలి తగ్గుతుందని వెల్లడించింది. 22 నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే చాన్స్ ఉన్నదని పేర్కొన్నది.
ఉత్తర, పశ్చిమ జిల్లాలు గజగజ
రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాలు చలితో గజ గజ వణుకుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 8, జగిత్యాల జిల్లా గోవిందారంలో 8.6, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 8.7, కామారెడ్డి జిల్లా బోమనదేవిపల్లిలో 8.8, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 8.9, నిజామాబాద్ జిల్లా గోపనపల్లిలో 9.2, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 9.2, మెదక్ జిల్లా నార్లాపూర్‌లో 9.5, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 9.9, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, కరీంనగర్ జిల్లా వెదురుగట్టు, పెద్దపల్లి జిల్లా ఓదెలలో 10 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలోనూ చాలా చోట్ల ఉష్ణోగ్రతలు అదే స్థాయిలో రికార్డవుతున్నాయి. బీహెచ్ఈఎల్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంతాల్లో 11 డిగ్రీల మేర నైట్టెంపరేచర్లు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌లో 11.5, శివరాంపల్లిలో 12.8, కంటోన్మెంట్‌లో 13, వెస్ట్‌మారేడ్‌పల్లిలో 13.4 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి.
సగటు కన్నా దారుణంగా పడిపోతున్నయ్
నవంబర్ నెలలో సగటు రాత్రి ఉష్ణోగ్రతలు 18.2 డిగ్రీలు కాగా.. ప్రస్తుతం దానికన్నా 4 నుంచి 12 డిగ్రీల దాకా తక్కువకు పడిపోతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో సాధారణం కన్నా 12 డిగ్రీలు తక్కువగా టెంపరేచర్లు రికార్డవడం చలి తీవ్రతకు అద్దం పడుతున్నది. జోగుళాంబ గద్వాల, వనపర్తి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతల కన్నా 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో సోమవారం 13.9 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డయ్యాయి. బుధవారం కూడా రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కోల్డ్వేవ్స్ తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
