నేటి (నవంబర్ 19) నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ.. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభం

నేటి (నవంబర్ 19) నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ.. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తొలి విడత గ్రామీణ ప్రాంతాల్లో, రెండో విడత పట్టణ ప్రాంతాల్లో చీరలను డిస్ట్రిబ్యూట్​ చేయాలని నిర్ణయించింది. ఇందిరాగాంధీ జయంతి  నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని  అధికారులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశించారు.

రెండో దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి ఒకటి నుంచి మార్చి 8  అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో జూబ్లీహిల్స్​నివాసంలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి  సమీక్షించారు.

చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారని, ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో  రెండు విడతల్లో  పంపిణీ చేపట్టాలని  అధికారులకు  సూచించారు. చీరల నాణ్యత విషయంలో రాజీపడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశించారు. 

బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్‌‌‌‌రోడ్‌‌‌‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పించిన అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి  లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో పాల్గొనాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క,  సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్,  ప్రిన్సిపల్ సెక్రెటరీ హ్యాండ్లూమ్స్ శైలజా రామయ్యర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, సెర్ప్ సీఈవో డి.దివ్య పాల్గొన్నారు.

ఇందిర ఆశయాలు ఎప్పటికీ ప్రేరణే  
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆమెను స్మరించుకున్నారు. ఇందిరా గాంధీ ..దేశ ప్రగతి, పేదల అభ్యున్నతి కోసం ప్రాణాలను అర్పించిన మహనీయురాలని కొనియాడారు.తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా దేశ సమగ్రత, సమైక్యత, పటిష్ఠత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగిన ధైర్యవంతురాలని తెలిపారు. ఇందిరమ్మ పాలనను ఆదర్శంగా తీసుకుని ప్రజా ప్రభుత్వం నడుపుతున్నామన్నారు. ఇందిరా గాంధీ ఆశయాలు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయని, ఆమె త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తిగా ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.