మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్‌‌‌‌కౌంటర్.. ఆయన భార్య రాజే, మరో నలుగురూ మృతి

మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్‌‌‌‌కౌంటర్.. ఆయన భార్య రాజే, మరో నలుగురూ మృతి
  • ఆంధ్రప్రదేశ్​లోని మారేడుమిల్లి అడవుల్లో ఎదురుకాల్పులు
  • హిడ్మాపై రూ.కోటి, రాజేపై రూ.50 లక్షల రివార్డు 
  • ఘటనా స్థలంలో రెండు ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం
  • భద్రతా దళాలపై మెరుపు దాడులు చేసి మోస్ట్ వాంటెడ్‌గా మారిన హిడ్మా 
  • అతడే టార్గెట్‌గా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన కేంద్రం..
  • భద్రతా బలగాలకు నవంబర్ 30 డెడ్‌లైన్‌ 
  • గడువుకు 12 రోజుల ముందుగానే ఆపరేషన్ పూర్తి

హైదరాబాద్ / భద్రాచలం, వెలుగు: మావోయిస్ట్​ అగ్రనేత మడవి హిడ్మా ఎన్‌కౌంటర్‌‌లో మరణించారు. కొన్నాళ్లుగా కేంద్ర బలగాలతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఆయన.. మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్​లోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌‌లో హిడ్మా భార్య రాజక్క అలియాస్ రాజే, మరో నలుగురు మావోయిస్టులూ మరణించారు.

మావోయిస్టు పార్టీ సెంట్రల్ ​కమిటీ సభ్యుడిగా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బెటాలియన్–1 కమాండర్‌‌గా వ్యవహరిస్తున్న హిడ్మాపై రూ.కోటి, ఆయన భార్య రాజేపై రూ.50 లక్షల రివార్డ్​ ఉంది. భద్రతా దళాలపై మెరుపు దాడులు చేయడంలో దిట్టగా పేరున్న హిడ్మా.. చాలా ఏండ్లుగా పోలీస్​ హిట్​ లిస్టులో ఉన్నారు. 5 రాష్ట్రాల పోలీసులకు కొరకరాని కొయ్యగా మారారు. అనేక ఎన్‌కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. 

ఆపరేషన్ హిడ్మా చేపట్టి..
వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్​ చేపట్టింది. దీంతో పలువురు కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఇటీవల పెద్ద సంఖ్యలో లొంగిపోయారు. కానీ మోస్ట్​ వాంటెడ్​ లీడర్​ మడవి హిడ్మా లొంగుబాట్లను వ్యతిరేకిస్తున్నారనే పక్కా సమాచారంతో ఐదు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర బలగాలు ఆయన టీమ్‌ను టార్గెట్​ చేశాయి. 

ఈ క్రమంలో ‘ఆపరేషన్​ హిడ్మా’ చేపట్టాలని బలగాలను ఆదేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్​షా.. ఆ ఆపరేషన్ పూర్తి చేసేందుకు నవంబర్30 డెడ్‌‌‌‌లైన్​ విధించారు. ఇందులో భాగంగా భద్రతా బలగాలు చత్తీస్‌‌‌‌గఢ్, తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా, మహారాష్ట్ర బార్డర్లలో స్పెషల్​ ఆపరేషన్ ​ప్రారంభించాయి. ఇంద్రావతి నేషనల్​ పార్క్, కర్రె గుట్టలు, ఏవోబీ వరకు హిడ్మా టీమ్‌‌‌‌ను వెంటాడుతూ ఉచ్చు బిగించాయి. అయితే హిడ్మా తప్పించుకుంటూ అక్టోబర్​26న ఏవోబీకి చేరుకున్నాక ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయన కదలికలను పసిగట్టాయి.

ఆంధ్రప్రదేశ్ ​డీజీపీ హరీశ్​కుమార్​ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్​చంద్ర లడ్డా పర్యవేక్షణలో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్​ఆధ్వర్యంలో రెండ్రోజుల కింద కూంబింగ్​చేపట్టారు. ఈ క్రమంలోనే హిడ్మా టీమ్ ఏపీలోని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవుల్లోకి వచ్చినట్టుగా గుర్తించి గ్రేహౌండ్స్ బలగాలు చుట్టుముట్టాయి. టైగర్​జోన్​దగ్గర నల్లూరు జలపాతం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తాము జరిపిన ఎదురుకాల్పుల్లో హిడ్మా, అతని భార్య రాజే, డీసీఎం లక్ష్మణ్​, పీపీసీఎం కమ్లూ, పీపీసీఎం మల్లా, హిడ్మా గార్డు దేవే మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. వాళ్ల మృతదేహాలను మారేడుమిల్లి ఆసుపత్రి మార్చురీకి తరలించామని తెలిపారు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47, ఒక పిస్టల్, రివాల్వర్, సింగిల్​బోర్​తుపాకీ, 25 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్​ఎలక్ట్రికల్​డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్​బండిల్, కెమెరా ఫ్లాష్​లైట్, కటింగ్​బ్లేడ్, 25 మీటర్ల ఫ్యూజ్ వైర్, ఏడు కిట్​బ్యాగులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 

కొడుకా.. లొంగిపో..
చత్తీస్‌‌‌‌గఢ్​ డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ్​శర్మ ఇటీవల స్వయంగా హిడ్మా ఇంటికి వెళ్లారు. హిడ్మా లొంగిపోయేందుకు కృషి చేయాలని ఆయన తల్లిని కోరారు. తన కొడుకు ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని హిడ్మా తల్లి కూడా ‘కొడుకా.. లొంగిపో ’ అంటూ పిలుపునిచ్చారు. కానీ ఆయుధం వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు హిడ్మా అంగీకరించలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను గానీ.. లొంగిపోయే ప్రసక్తే లేదని ప్రకటించారు. 

పట్టుకుని చంపారు: పౌర హక్కుల సంఘం 
హిడ్మా, అతని సహచరుల ఎన్‌‌‌‌కౌంటర్​ బూటకమని.. వాళ్లను పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని ఆంధ్రప్రదేశ్​పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వేడంగి చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్ ఆరోపించారు. ‘‘ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో గత నెల 28న ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని ఓ షెల్టర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న హిడ్మా, అతని సహచరులను పోలీసులు పట్టుకున్నారు. వాళ్లను మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లి, నిరాయుధులను చేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ బూటకపు ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌ను తీవ్రంగా ఖండిస్తున్నం” అని మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు.

పోలీసులు మరింత మంది మావోయిస్టులను హత్య చేసే అవకాశం ఉందని, అదుపులోకి తీసుకున్న వారందరినీ వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్‌‌‌‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరారు.

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్
చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన మడవి హిడ్మా.. అతి చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరారు. తక్కువ కాలంలోనే పీఎల్జీఏ కమాండర్‌‌‌‌‌‌‌‌గా, మిలటరీ చీఫ్‌‌‌‌గా ఎదిగారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఏకైక ఆదివాసీ మావోయిస్టు నేత హిడ్మానే. మెరుపు వేగంతో దాడులు చేయడం, తప్పించుకోవడం, వ్యూహాలు రచించడంలో దిట్ట. 2007 నుంచి ఇప్పటి వరకు అనేక స్కెచ్‌‌‌‌లు వేసి వందలాది మంది పోలీసులను, వివిధ పార్టీల లీడర్లను చంపిన ఘటనలు ఉన్నాయి. 

మావోయిస్ట్​ అగ్రనేత చలపతి శిక్షణలో రాటుదేలిన హిడ్మా.. పార్టీలోనే మోస్ట్ వాంటెడ్‌‌‌‌గా మారారు. అతడు స్కెచ్​వేస్తే తిరుగుండదన్న పేరు సంపాదించుకున్నారు. 2007లో బస్తర్‌‌‌‌‌‌‌‌లోని రాణి బోద్లీ సీఆర్పీఎఫ్​ క్యాంపుపై దాడి చేసి 55 మందిని చంపిన ఘటనతో హిడ్మా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

2010లో దంతెవాడ జిల్లాలో జరిపిన తాడ్‌‌‌‌మెట్ల దాడి దేశంలోనే అతిపెద్దది. ఈ ఘటనలో 76 మంది జవాన్లు చనిపోయారు. అదే ఏడాది సింగవరంలో ఐఈడీ పేల్చి 20 మంది జవాన్లను చంపారు. 2013లో జీరాంఘాట్​దాడిలో సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్రఖర్మతో పాటు 32 మంది కాంగ్రెస్​లీడర్లను, జవాన్లను చంపారు. 

2014లో సుక్మా జిల్లా టాహ్​కవాడా వద్ద చేసిన దాడిలో16 మంది జవాన్లను, 2017లో సుక్మా జిల్లా బుర్కపాల్ ​వద్ద 25 మంది పోలీసులను, 2020లో చింతగుఫ అడవుల్లో17 మంది జవాన్లను, 2021లో బీజాపూర్​జిల్లా టేకలగూడెలో 22 మంది భద్రతా సిబ్బందిని చంపిన ఘటనల్లో హిడ్మా కీలక సూత్రధారి.

అందుకే దండకారణ్యంలో హిడ్మాను అడ్డుకుంటే మావోయిస్టు ఉద్యమానికి పూర్తిగా అడ్డుకట్ట వేయొచ్చని కేంద్ర హోంశాఖ నిర్ధారించుకుంది. దీంతో ‘ఆపరేషన్​ హిడ్మా’ చేపట్టింది. అమిత్​షా ఇచ్చిన డెడ్‌‌‌‌లైన్‌‌‌‌కు12 రోజుల ముందే హిడ్మాను   భద్రతా బలగాలు ఎన్‌‌‌‌కౌంటర్ చేయడం సంచలనంగా మారింది.