- టీజీపీఎస్సీ అధికార పరిధి దాటి వ్యవహరించింది
- హైకోర్టు, సాంకేతిక కమిటీ సిఫారసులు అమలు చేయాల్సిందే
- 8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
- ఇప్పటికే విధుల్లో ఉన్న 1,032 మంది ఉద్యోగులపై ఎఫెక్ట్ !
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2019 అక్టోబర్24న విడుదల చేసిన 2015 గ్రూప్- 2 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. 2019లో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వైట్‌నర్ వినియోగం, దిద్దుబాట్లు ఉన్న పార్ట్ -బీ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం చెల్లదని స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టీజీపీఎస్సీకి లేదని పేర్కొంది. ఆన్సర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందన్నది స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తప్పుబట్టింది. 2019 అక్టోబర్ 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేస్తున్నామని తెలిపింది. సాంకేతిక కమిటీ సిఫారసులు, హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టు తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ 8 వారాల్లో పూర్తి చేయాలని కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.
2015 నాటి నోటిఫికేషన్.. 2019లో ఫలితాలు
సాంకేతిక కమిటీ సిఫారసులతోపాటు 2019 జూన్ 6న హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అన్ని జవాబు పత్రాలను వ్యాల్యూయేషన్ చేయడాన్ని సవాలు చేస్తూ బి. సుజాత మరో 14 మందితోపాటు మరో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గ్రూప్- 2 కింద 13 కేటగిరీల్లో 1,032 పోస్టుల భర్తీకి 2015 నోటిఫికేషన్ జారీ కాగా, 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ అయిందని, 2016 నవంబరు 11, 13 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయన్నారు.
ప్రశ్న పత్రం బుక్‌లెట్‌కు, ఓఎంఆర్ షీట్లకు పొంతన కుదరకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి 2016 డిసెంబరులో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రశ్న పత్రంలోని బుక్‌లెట్ నంబర్, ఓఎంఆర్ నంబరు ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందని 2017లో కమిటీ సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
ఓఎంఆర్ షీట్ పార్ట్- ఏలోని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించి చిన్నచిన్న పొరపాట్లు ఉంటే సవరించవచ్చని, అయితే పార్ట్- బీలోని 150 ప్రశ్నల జవాబులకు ఏదైనా తుడిచివేత, వైట్‌నర్ వాడినట్లయితే వాటిని వ్యాల్యూయేషన్చేయరాదని కమిటీ సిఫారసు చేసిందన్నారు. ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా సాంకేతిక కమిటీ సిఫారసులను సమర్థిస్తూ దాని ప్రకారం మూల్యాంకనం చేపట్టాలంటూ 2019 జూన్ 6న డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించిందన్నారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలు ముసుగులో ఓఎంఆర్ షీట్‌లలో వైట్‌నర్, తుడిచివేతలకు పాల్పడిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం ద్వారా ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా టీజీపీఎస్సీ వ్యవహరించిందని ఆరోపించారు. మూల్యాంకనం జరిగిన తీరును వివరించలేదని, అందువల్ల నియామకాలు రద్దు చేయాలని కోరారు.
నియామకాలు పూర్తయి.. వాళ్లంతా విధుల్లో ఉన్నారు: టీజీపీఎస్సీ లాయర్
ఓఎంఆర్ షీట్‌ల వ్యాల్యూయేషన్ అడ్వాన్స్‌డ్ ఆటోమేటెడ్ స్కానింగ్ వ్యవస్థ ద్వారా జరిగిందని, ఇందులో యంత్రాలు తప్ప మనుషుల ప్రమేయం ఉండదని కమిషన్ తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే నియామకాలు పూర్తయ్యాయని, వారంతా విధుల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఈ దశలో ఏదైనా వ్యతిరేక ఉత్తర్వులు ఇస్తే నియమకాలకు భంగం వాటిల్లడంతోపాటు పరిపాలనాపరమైన గందరగోళానికి దారితీస్తుందన్నారు.
అర్హత సాధించలేకపోవడంతో కోర్టును ఆశ్రయించారని, ఇలాంటి వాటిని అనుమతించరాదంటూ సుప్రీంకోర్టు వెల్లడించిందని, పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న జడ్జి.. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కనపెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనన్నారు.
సాంకేతిక కమిటీ సిఫారసులను అనుమతిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2019 జూన్ 3న ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొందన్నారు. ఈ తీర్పు మేరకు పార్ట్‌బీలోని ఆన్సర్లను వ్యాల్యూయేషన్ చేయరాదన్నారు. పార్ట్ బీలోని జవాబుల మూల్యాంకనంపై కమిటీ నిషేధం విధించిందని, దీనికి విరుద్ధంగా కమిషన్ చేపట్టిన మూల్యాంకనం కమిటీ సిఫారసులు, హైకోర్టు తీర్పును పట్టించుకోకపోవడమేనన్నారు.
తేజ్‌ప్రకాశ్ పాథక్ వర్సెస్ రాజస్తాన్ హైకోర్టులో ప్రభుత్వ నియామకాల్లో రాజ్యాంగ హక్కులైన పారదర్శకత, సమానత్వం ఉండాలని స్పష్టంగా ఉందన్నారు. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా పార్ట్- ఏకు పరిమితం కాకుండా అన్ని పేపర్లకు మూల్యాంకనాన్ని విస్తరించడం చట్టవిరుద్ధం, ఏకపక్షమని పేర్కొన్నారు. అందువల్ల 2019 అక్టోబరు 24న విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తున్నామంటూ తీర్పు వెలువరించారు. హైకోర్టు, సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు 8 వారాల్లో తిరిగి వ్యాల్యూయేషన్ చేపట్టి నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.
