- సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం రెండు డొమైన్లు
- అమీర్‌పేట్‌లో ఒకటి, అమెరికాలో మరోటి రిజిస్టర్
- రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడి
హైదరాబాద్ సిటీ/బషీర్ బాగ్, వెలుగు: ఐబొమ్మ, బప్పంటీవీ సిరీస్ వెబ్ సైట్లతో సినిమాలను పైరసీ చేసిన ఇమ్మడి రవి.. ఆ వెబ్ సైట్ ల యూజర్లను బెట్టింగ్ యాప్ లకు సైతం మళ్లించినట్టుగా పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా రెండు డొమైన్లను క్రియేట్ చేశాడని.. వాటిలో ఒకటి హైదరాబాద్ అమీర్ పేట్ లో, మరోటి అమెరికాలో రిజిస్టర్ అయి ఉన్నాయని కనుగొన్నారు. రవి Tradersin.com, Makeindiashop.shop అనే డొమైన్లు వాడి 1win, 1xbet వంటి బెట్టింగ్యాప్స్ప్రమోట్చేశాడని తేల్చారు.
ఈ రెండు డొమైన్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి అతడికి డబ్బు వచ్చిందని.. ఆ డబ్బు నేరుగా ఇమ్మడి రవి పేరుతో ఐసీఐసీఐ బ్యాంకు ఎన్ఆర్ఈ ఖాతాకు ట్రాన్స్ఫర్అయ్యిందని నిర్ధారించుకున్నారు. ఒక్కోసారి లక్షలు, మరోసారి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్సైతం జరిగినట్టు గుర్తించారు. రవి అరెస్ట్ తర్వాత పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో ఈ మేరకు కీలక విషయాలు బయటపడ్డాయి.
పట్టించిన ట్రాఫిక్ డైవర్షన్ డొమైన్లు
ఐబొమ్మ నుంచి బెట్టింగ్ సైట్లకు వెళ్లేందుకు మధ్యలో ట్రాఫిక్ డైవర్షన్ డొమైన్లను రవి స్వయంగా ఏర్పాటు చేశాడని పోలీసులు గుర్తించారు. యూజర్ ఐబొమ్మలో మూవీ చూస్తూ ఉంటే.. పక్కనే పాప్ -అప్ వచ్చి బెట్టింగ్ యాప్స్ లింకులు కనిపించేవని, ఆ లింక్ ను యూజర్లు క్లిక్ చేసిన ప్రతిసారీ రవికి కొంత కమీషన్ వచ్చేదని తేల్చారు.
అయితే, ఈ ట్రాఫిక్ డొమైన్లే చివరికి రవిని పట్టించాయని చెప్తున్నారు. పోలీసులు ఈ డొమైన్ల ట్రాఫిక్‌ను ట్రాక్ చేసి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌తో రవిని పట్టుకున్నట్టు తెలుస్తున్నది. ‘రవిని అరెస్టు చేయకపోతే ఇలాంటి వెబ్సైట్స్మళ్లీ మళ్లీ సృష్టిస్తూనే ఉంటాడు. ఇది ఆగాలంటే రవిని రిమాండ్‌కు తీసుకోవడం అత్యవసరం’ అని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.
రవి మొత్తం17 వెబ్సైట్స్క్రియేట్ చేశాడని.. అందులో ఐబొమ్మ సిరీస్ లో IBOMMA.foo, ibomma.nexas, ibomma.market, ibomma.one వంటివి.. అలాగే బప్పం సిరీస్‌లో bappam.tv, bappam.cc, bappam.co.in, bappam.net, bappam.org, bappam.eu వంటివి సృష్టించాడని పోలీసులు గుర్తించారు. ఇవన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉన్నాయని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిరూపించారు.
పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయంతో ఈ డొమైన్లన్నీ ఒకే ఐపీ, ఒకే ఈ–మెయిల్, ఒకే మొబైల్ నంబర్‌కు లింక్ అయినట్టుగా గుర్తించారు. సర్వర్లు ఎక్కడ పెట్టాలి, డొమైన్లు ఎలా మార్చాలి, బ్లాక్ అయిన సైట్స్‌ను ఎలా మళ్లీ లైవ్ చేయాలి అన్నది రవి స్వయంగా చూసుకునేవాడని పేర్కొన్నారు.
రవి బెయిల్ పిటిషన్.. పోలీసుల కస్టడీ పిటిషన్
తెలుగు సినిమాల పైరసీ కేసులో ఈ నెల14న అరెస్టయిన ఐబొమ్మ రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. రవిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా వాదనలు జరిగాయి. అనంతరం కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
రవి పైరసీ వెబ్ సైట్లు నిర్వహిస్తూ ప్రతినెలా 3.7 మిలియన్ యూజర్లను తన వెబ్ సైట్ లకు రప్పించి, బెట్టింగ్ యాప్ లకు మళ్లించినట్టుగా పోలీసులు కోర్టుకు తెలిపారు. అతడు అక్రమంగా రూ. 21 కోట్లకుపైగా సంపాదించినట్టు వెల్లడించారు.
నకిలీ పాన్ కార్డుతో బినామీ ఖాతాల ద్వారా క్రిప్టో లావాదేవీలు జరిపినట్లు, సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేసినట్లు కూడా గుర్తించామన్నారు. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశం పాస్ పోర్ట్‌తో విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు రాబట్టడం కోసం రవిని కస్టడీ అప్పగించాలని కోరారు. కాగా, రవి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.
