వైష్ణో దేవి టెంపుల్‌ తొక్కిసలాటపై హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశం

వైష్ణో దేవి టెంపుల్‌ తొక్కిసలాటపై హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశం

వైష్ణో దేవి టెంపుల్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది జమ్ము కశ్మీర్ ప్రభుత్వం. మృతులకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హా తెలిపారు.

మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.  పీఎం రిలీఫ్ ఫండ్‌ నుంచి మరో రూ.2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందించనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని చెప్పారు.

హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశం

ఈ ఘటనపై హోం శాఖ ముఖ్య కార్యదర్శి  నేతృత్వంలో హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. ఈ కమిటీలో జమ్ము ఏడీజీపీ, జమ్ము డివిజినల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ ఘటన గురించి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాకు వివరించామన్నారు.

కాగా, న్యూ ఇయర్ రోజన జమ్మూకశ్మీర్ లో విషాదం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్ లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది భక్తులు చనిపోగా.. దాదాపు 13 మందికి గాయాలయ్యాయని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులు భారీగా తరలిరావడంతో దర్శనం క్యూలో కొందరి మధ్య వాగ్వాదం జరిగి అది తొక్కిసలాట దారి తీసిందని ప్రాథమిక సమాచారం అందుతోందని డీజీపీ చెప్పారు. తెల్లవారుజామున 2.45 గంటలకు ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు.