ఓ ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది

ఓ ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది

ఓ ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. ఆ ఐడియాతో కోట్లు సంపాదిస్తున్నాడు. ఏదీ వేస్ట్ కాదు.  ప్రతిదీ ఉపయోగపడుతుందని నిరూపించాడు హైదరాబాద్ కు చెందిన నాగరాజు. కొబ్బరి బొండాల పీచుతో బిజినెస్ చేస్తూ... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 
హైదరాబాద్ లో గల్లీకో కొబ్బరి బొండం షాప్ ఉంటుంది. వీటి నుంచి పెద్ద సంఖ్యలో తాగి పడేసిన కొబ్బరి బోండాలు వస్తూ ఉంటాయి. ఈ బొండాలన్నీ జవహర్ నగర్ లో ఉన్న డంప్ యార్డ్ కి ప్రతి రోజూ GHMC తరలిస్తుంది. నాగరాజు అనే యువకుడు అందరికంటే భిన్నంగా ఆలోచించాడు.  తాగి పడేసిన ఈ బొండాలు తీసుకొచ్చి వాటితో వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. బొండాల పీచుతో రక రకాల వస్తువులను తయారు చేస్తున్నాడు. 
నగరంలో సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసి..రోజూ సిటీలో కొబ్బరి బొండాలను సేకరిస్తున్నాడు. ఆ ఖాళీ బొండాల నుంచి 50 శాతం పీచు, 50 శాతం కొబ్బరి ఎరువును తయారు చేస్తున్నాడు నాగరాజు. ఉత్పత్తి చేసిన ముడి సరుకుని హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్లాంట్ లో పీచుతో సోఫాలు, కుర్చీలు లాంటివి తయారవుతున్నాయి. ప్రస్తుతం తన దగ్గర 12 మంది పని చేస్తున్నట్టు నాగరాజు చెప్పాడు. 
మొదట ఈ ప్లాంట్ ను తన తండ్రి ప్రారంభించారని.. నష్టాలు రావడంతో క్లోజ్  చేశామన్నాడు నాగరాజు. ఎలాగైనా మళ్లీ ఈ వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచించినప్పుడు తనకు ఈ ఐడియా వచ్చిందన్నాడు. అసలు కొబ్బరి బొండాల నుంచి పీచు తీయడంపై కొన్ని రోజులు స్టడీ చేసి సొంతంగా యంత్రాలు తయారు చేసి 2014లో ఈ ప్లాంట్ మళ్లీ ప్రారంభించారు. రోజుకు 30 టన్నుల కొబ్బరి బొండాలతో దాదాపు 3 టన్నుల ముడి సరుకు ఉత్పత్తి చేస్తున్నామని, ఈ సరుకుని ఇతర రాష్ట్రాలతోపాటు నగరంలోనూ సరఫరా చేస్తున్నామన్నారు. సొంతంగా మెషీన్ల తయారీకి దాదాపు 20 లక్షలు ఖర్చుపెట్టానన్నాడు నాగరాజు. ఆసక్తి ఉన్న యువతకు ఈ బిజినెస్ ఎలా చేయాలో చెప్పడానికి సిద్ధమంటున్నాడు.