రెండు హెలికాప్టర్లు ఢీ.. నలుగురు మృతి

రెండు హెలికాప్టర్లు ఢీ.. నలుగురు మృతి

కాన్ బెర్రా : ఆస్ట్రేలియాలో సోమవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. క్వీన్స్‌‌‌‌లాండ్ స్టేట్ గోల్డ్ కోస్ట్‌‌‌‌లోని మెయిన్ బీచ్ పైన గాలిలో రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. టూరిస్ట్ స్పాట్ అయిన సీ వరల్డ్ థీమ్ పార్క్ బీచ్‌‌‌‌లో ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగానే మరో హెలికాప్టర్ టేకాఫ్ అయ్యిందని.. దాంతో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయని వివరించారు. ప్రమాదంలో ఒక హెలికాప్టర్ నుజ్జునుజ్జు అయ్యిందని.. దాని భాగాలన్ని సీ వరల్డ్ థీమ్ పార్క్ బీచ్ ఇసుకలో చెల్లాచెదురుగా పడిపోయాయని తెలిపారు. మరొకటి ఇసుకపై సేఫ్ గా ల్యాండ్ అయిందని..అందులో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పిందని వివరించారు.

యాక్సిడెంట్ లో మరణించిన, తీవ్రంగా గాయపడినవారంతా హెలికాప్టర్‌‌‌‌లోని ప్రయాణికులేనని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్, ఆరోగ్య సిబ్బందిని వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. టూరిస్టుల సహకారంతో గాయపడిన వారందరిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. క్రాష్ సైట్‌‌‌‌కు ఎవరూ వెళ్లకుండా దారిని క్లోజ్ చేశామన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంపై క్వీన్స్‌‌‌‌లాండ్ స్టేట్ ప్రీమియర్ అన్నాస్టాసియా పలాస్జ్‌‌‌‌జుక్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.