ఉప్పల్​ పీఎస్ పరిధిలో ఆన్​లైన్ గేమ్స్​ ఆడేందుకు చోరీ

ఉప్పల్​ పీఎస్ పరిధిలో ఆన్​లైన్ గేమ్స్​ ఆడేందుకు చోరీ
  •     నిందితురాలిని అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు
  •     రూ. 4లక్షల నగదు, 249 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

ఉప్పల్​,వెలుగు :  ఆన్​లైన్ ​గేమింగ్​కు అలవాటు పడిన ఓ మహిళ  చోరీ చేసి నగలు, నగదు  దోచుకెళ్లిన సంఘటన ఉప్పల్​ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి రూ.4లక్షల నగదు, 25 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మల్కాజిగిరి డీసీపీ జానకి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా సైదాపూర్​కు చెందిన బొల్ల నిర్మల(34) సిటీకి వచ్చి రామంతాపూర్​లో నివసిస్తూ.. ఇండ్లల్లో వంట మనిషిగా చేస్తుంది.  నిర్మల వంట చేసే పక్కింట్లో గోవు  కరుణాకర్​రెడ్డి కుటుంబం ఉంటుంది. బయటకు వెళ్లేలప్పుడు ఇంటి తాళాలు పక్కనే ఉండే డబ్బాలో పెట్టి వెళ్తుంటారు. ఇది నిర్మల గమనిస్తూనే ఉంది.  కరుణాకర్​ రెడ్డి గత నెల 30న పని మీద బెంగళూరు వెళ్లాడు.   

నిర్మల ఇంటి తాళాలు తీసి లోపలికి వెళ్లి బీరువాలోని నగలు , నగదు చోరీ చేసి పారిపోయింది. ఈనెల 6న  కరుణాకర్​రెడ్డి బెంగళూరు నుంచి తిరిగి వచ్చి ఇంటి తాళాలు తీసినట్లు గుర్తించాడు. బీరువాలో చూడగా రూ.4.75లక్షల నగదు, 249 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అయినట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మలను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ పాల్పడినట్లు అంగీకరించింది. ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనం చేసినట్టు వెల్లడించింది.