వెలుగు సక్సెస్ .. అలీనోద్యమం

వెలుగు సక్సెస్ .. అలీనోద్యమం

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచం రెండు సైనిక కూటములుగా ఏర్పడింది. ఒక కూటమి మరో కూటమిపై ఆధిక్యత పొందడానికి ప్రయత్నిస్తూ ప్రపంచాన్ని అతి భీకర పరిస్థితుల్లోకి నెట్టిన సమయంలో అలీన విధానం అవతరించింది. కేవలం రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచంలోనే అత్యధిక దేశాల ఆదరణ పొందిన అలీన విధానం ప్రస్తుతం ఒక మహోద్యమ రూపం దాల్చింది. 

అలీన విధానం అంటే తటస్థ విధానం కాదు. ఏ అగ్రరాజ్య సైనిక కూటమిలోనూ విలీనం కాకపోవడం మాత్రమే. ఈ విధానం సైన్యాన్ని వినియోగించడానికి వ్యతిరేకం కాదు. ఆత్మరక్షణకు సైనిక వినియోగాన్ని అలీన విధానం సమర్థిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే జాతీయ స్వాతంత్ర్యం, సమానత్వం, పరస్పర ప్రయోజనాలు ప్రతిపాదికలుగా ఉన్న సైనిక కూటముల ఏర్పాటు, వాటిలో విలీనం కావడాన్ని వ్యతిరేకిస్తూ సాంఘిక, రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో పరస్పర సహకారానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే రాజ్యాల స్వతంత్ర విధానమే అలీన విధానం.

ఇందులో శాంతి, స్వాతంత్ర్యం, సమానత్వం, న్యాయం, సార్వభౌమత్వం, భద్రత, పరస్పర సహకారం, అభివృద్ధి సంక్షిప్తమై ఉన్న భావనలు. అలీన ఉద్యమ ఏర్పాటుకు కృషి చేసినవారు: జవ హర్​ లాల్​ నెహ్రూ (భారతదేశం), జోసెఫె టిటో (యుగోస్లోవియా), అబ్దుల్​ నాజర్​ (ఈజిప్టు),  సుకర్నో (ఇండోనేషియా) 

ఆవశ్యకత అంశాలు: స్వతంత్ర విదేశీ విధానం, వలస వాద వ్యతిరేకత, ఏ సైనిక కూటమి లేదా అధికార కూటమిలో సభ్యత్వం లేకుండా ఉండటం, ఏ పెద్ద రాజ్యాలతోనూ ద్వైపాక్షిక ఒప్పందాలు లేకపోవడం, తమ భూభాగాల్లో విదేశీ సైనిక స్థావరం లేకపోవడం. 

కారణాలు: పాశ్చాత్య రాజ్యాలు అనుసరించిన సామ్రాజ్యవాదం, వలస విధానం, జాతి విచక్షణా విధానం తీసుకువచ్చిన తీవ్ర పరిణామాలు అలీన విధానం ఏర్పడటానికి కొంత కారణమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం రెండు దశాబ్దాలు కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధ పరిణామాలు ప్రపంచ రాజకీయాలను కలవరపరిచాయి. పశ్చిమ రాజ్యాలు, కమ్యూనిస్టు రాజ్య కూటమి సిద్ధాంతాల పట్ల ఆ కాలంలో చెలరేగిన అపనమ్మకం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యం పొందిన రాజ్యాల ఆర్థిక పరిస్థితి, శాంతి, సహజీవనం, సామరస్యం, సహకారం తదితర భావనల్లో ఉన్న ప్రగాఢమైన విశ్వాసం, ప్రపంచ యుద్ధమంటే అణ్వస్త్ర యుద్ధమనే దానిలో విభేదాలు, పరాజితులు అనే భేదం ఉండదని, ఇరుపక్షాలు నాశనమవుతాయని గుర్తించడం, సమానత్వం, పరస్పర సహకారం ప్రాతిపదికలుగా ఆర్థిక సంబంధాలు నెలకొల్పడానికి కొన్ని రాజ్యాలు ఆలోచించడం కారణాలుగా చెప్పవచ్చు. 

ఎదురవుతున్న సవాళ్లు : అలీనోద్యమ సిద్ధాంతాలను అమలు చేయడంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అలీన రాజ్యాల సంఖ్యాబలం ప్రస్తుతం బాగా పెరిగింది. మొదట్లో కేవలం 29 రాజ్యాలతో ప్రారంభమైన అలీనోద్యమం ప్రస్తుతం సుమారు 100 కిపైగా రాజ్యాల సభ్యులు ఉన్నారు. ఈ సభ్యత్వం పెరుగుదల సామరస్యానికి, సదవగాహనకు, సమైక్య కృషికి కొంతవరకు ప్రతిబంధకమ వుతోంది.

సభ్య రాజ్యాల మధ్య గల సిద్ధాం తపరమై విభేదాలు ఉద్యమం నిర్వహణలో కొంత ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వీటిలో కొన్ని రాజ్యాలు సాంప్రదాయక వైఖరి, కొన్ని మితవాద వైఖరి, కొన్ని తీవ్రవాద వైఖరిని అనుసరించేవి. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి నిర్ణయాలు త్వరితంగా తీసుకోవడానికి కష్టమవుతోంది.  ప్రచ్ఛన్న యుద్ధం సడలడంతో  అసలు అలీన విధానం అవసరమా అనే కొత్త ప్రశ్న తలెత్తింది.      

లక్ష్యాలు.. 

  •     సామ్రాజ్యవాదం, వలస విధానం, నూతన వలస విధానం, అంతర్జాతీయ ఉద్రిక్తతలకు, సంఘర్షణలకు మూల కారణాలని ఇవి ప్రపంచ శాంతి భద్రతలకు ప్రమాదకరం కాబట్టి వాటిని నివారించడం.
  •     జాతి వ్యతిరేక వైఖరులు, జాతి వినాశన విధానం, జాతి విచక్షణ విధానం వంటి వాటిని అలీనోద్యమం వ్యతిరేకిస్తుంది. వ్యక్తిగత ప్రజాస్వామ్య విలువలైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సామ్యవాద లక్ష్యాలైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం సాధించడం.
  •     వ్యక్తిగత విలువలతోపాటు జాతీయ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, సమగ్రత వంటి భావనలను బలపరచడం. 
  •     అలీన విధానం నిరాయుధీకరణను సమర్థిస్తుంది. ఆయుధీకరణ వల్ల దేశ సంపదను  ఆయుధ సేకరణ కోసం వినియోగిస్తారు. అలీన విధానానికి ఐక్యరాజ్య సమితి ఆశయాల పట్ల విశ్వాసం ఉంచడం. 
  • ఉద్యమ విజయాలు: అంతర్జాతీయ రంగంలో అలీన ఉద్యమం ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. ఈ ఉద్యమం అనేక విజయాలను సాధించింది. 
  •     సామ్రాజ్యవాదం, వలస విధానం, జాతి విచక్షణ విధానాల వల్ల పీడిత రాజ్యాలు అలీనోద్యమం మద్దతుతో స్వాతంత్ర్యం పొందాయి. 
  •     అలీన ఉద్యమం కొత్తగా స్వాతంత్ర్యం పొందిన రాజ్యాలకు గుర్తింపు, హోదాను సమకూర్చింది. 
  •     అలీన ఉద్యమం ప్రస్తుతం అంతర్జాతీయ ప్రభావ వర్గంగా పనిచేసే శక్తియుక్తులను సమకూర్చుకోవడం మరో ఘనవిజయం. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ రాజకీయాలపై విశేష ప్రభావాన్ని కనబరిచాయి. 
  •     అలీన ఉద్యమం కొంత మేరకు ప్రాక్​, పశ్చిమ సంఘర్షణలో ఉద్రిక్తతల సడలింపునకు, సయోధ్యతో  కూడిన వాతావరణం నెలకొనడానికి తోడ్పడింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలను సడలించింది. 
  •     అలీన దేశాలు ఐక్యరాజ్య సమితితో ఒక బలమైన శాంతి శక్తిగా వ్యవహరిస్తున్నాయి. యూఎన్​ఓలో సుమారు 2/3 వంతు రాజ్యాలు అలీన రాజ్యాలే. అంతేకాకుండా ఈ రాజ్యాల లక్ష్యాలకు, ఐరాస లక్ష్యాలకు చాలా సన్నిహితత్వం ఉంది. 
  •     నిరాయుధీకరణ పెంపొందించాల్సిన అగత్యాన్ని ప్రపంచ రాజ్యాలు గుర్తించేటట్లు చేయడానికి, నిరాయుధీకరణపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని యూఎన్​ఓ నిర్ణయించడానికి అలీన రాజ్యాలు తీసుకువచ్చిన ఒత్తిడియే కారణం. 
  •     అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ తమ ఉమ్మడి ఆర్థిక, రాజకీయ, పర్యావరణ ప్రయోజనాల కోసం అనేక అంతర్జాతీయ వేదికలపై మూడో ప్రపంచ దేశాలుగా తమ గళాన్ని వినిపించడానికి కూడా అలీనోద్యమాన్ని 
  • వినియోగించుకుంటున్నాయి.