
ఏ కంపెనీ అయినా ఉద్యోగులకి పండగలకు బోనస్ లు, గిఫ్ట్స్ లాంటివి ఇస్తుంది. ఇలా అన్ని కంపెనీలు తప్పనిసరి చేయకపోయినా కొన్ని ఉద్యోగుల మంచి కోసం అలోచించి చేస్తాయి. అయితే దీనికి వెరైటీగా ఒక కంపనీ ఉద్యోగులనే దీపావళి పండగ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది... ఇది మీకు ఏంటి అని వింతగా అనిపించినా... ఇది నిజం....
ఉద్యోగుల నుండి దీపావళి పార్టీకి బలవంతంగా డబ్బు వసూలు చేయడం ప్రస్తుతం నెటిజన్లకు కోపం తెప్పిస్తుంది. ఒక కంపెనీ ఉద్యోగుల దీపావళి వేడుక కోసం ఒక్కొక్కరి నుంచి రూ.1,200 చందాగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోషల్ మీడియా యూజర్లు దీనిపై మండిపడుతున్నారు.
విషయం ఏంటంటే : దీపావళి సెలెబ్రేషన్స్ కోసం ఉద్యోగుల నుంచి చందాగా డబ్బులు వసూలు చేయాలని కంపెనీ యాజమాన్యం కోరిన తీరును ఆఫీస్ గ్రూప్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌లో చూడొచ్చు. చాట్లో దీపావళి పార్టీకి తప్పకుండ హాజరు కావాలని మ్యానేజ్మెంట్ అండ్ టీమ్ 100% తప్పనిసరి చేశారు. ప్రతి టీమ్ మెంబర్ రూ.1,200 ఇవ్వాలి. టీమ్ హెడ్ రూ.2,000 ఇవ్వాలి అని ఉంది. ఈ చాట్‌ను షేర్ చేసిన ఒక రెడ్డిట్ యూజర్, బోరింగ్ పార్టీ ఇవ్వడానికి మీ ఉద్యోగుల నుండి డబ్బు అడగడం... ఊహించుకోండి.. అదీ కూడా వాట్సాప్ లో.. ఇదేం బాలేదు" అని అన్నారు.
ఈ వసూళ్లపై నెటిజన్లు రాకరకాలుగా స్పందించారు. ఒకరైతే వాట్సాప్ ఆఫీస్ కబుర్ల కోసం కాదు. ఇలా చేసే కంపెనీకి ప్రొఫెషనలిజం గురించి పట్టదు, మీరు వీలైనంత త్వరగా ఆ కంపెనీని వదిలి వెళ్ళిపోవడానికి ఇదే మంచి ఛాన్స్" అని అనగా.... మరొకరు, హాజరు కావడం ఎందుకు తప్పనిసరి ? అది ఒక ఆప్షన్ కాదా ? ఎవరైనా డబ్బు కట్టకుండా రాకపోతే ఏం జరుగుతుంది? అని ప్రశ్నించారు. మూడో వ్యక్తి, దీపావళి పార్టీకి డబ్బు అడగడానికి ఎంత ధైర్యం అని అన్నారు. మొత్తనికి దీపావళి పండుగ సెలెబ్రేషన్స్ కోసం ఉద్యోగుల నుంచే డబ్బులు డిమాండ్ చేయడంపై నెటిజన్లు తీవ్రంగా కోపం వ్యక్తం చేశారు.