గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
  •     90 కిలోల గంజాయి పట్టివేత
  •     చౌటుప్పల్  మండలం పంతంగి టోల్  ప్లాజ్ వద్ద స్వాధీనం

చౌటుప్పల్, వెలుగు  :  అక్రమంగా స్మగ్లింగ్  చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను మహేశ్వరం జోన్ పోలీసులు, చౌటుప్పల్  పోలీసులు కలిసి మంగళవారం  అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్  మండలం పంతంగి టోల్   ప్లాజా వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్  జిల్లా సాహిబాబాద్  గ్రామానికి చెందిన మహమ్మద్  రయూస్  అఫ్రీది, మధ్యప్రదేశ్  రాష్ట్రం రేవా జిల్లా కుడారి గ్రామానికి చెందిన మిథిలేష్  సింగ్  ఒక ముఠాగా ఏర్పడ్డారు.

ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన డ్రగ్స్  వ్యాపారి చేత ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచి ఢిల్లీకి గంజాయి సరఫరా చేయించి భారీగా డబ్బు తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చున్నారు. గంజాయి సరఫరా చేయడానికి గత నెల 6న మహమ్మద్  రయూస్  అఫ్రీది, మిథిలేష్  సింగ్ కు మారుతి సుజుకి కారును న్యూఢిల్లీకి చెందిన డ్రగ్స్ వ్యాపారి అప్పగించాడు. పది రోజుల క్రితం ఆ ఇద్దరూ రాజమండ్రికి గంజాయి కోసం వెళ్లి 90 కిలోల ఎండు గంజాయిని సేకరించారు. సరుకును రాజమండ్రి నుంచి ఢిల్లీకి మారుతి కారులో తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

కారు నంబర్  ప్లేట్  మార్చి వెనుక సీట్ల లో సీక్రెట్ క్యాబిన్  ఏర్పరిచారు. కారు డిక్కీని ఇనుప రేకులతో కప్పి అందులో గంజాయిని దాచి పెట్టారు. ఈనెల 22న  సాయంత్రం రాజమండ్రి నుంచి న్యూఢిల్లీకి  వెళ్తుండగా పోలీసులకు సమాచారం అందింది. చౌటుప్పల్  మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద మహేశ్వరం జోన్  పోలీసులు చౌటుప్పల్ పోలీసులతో కలిసి వారు ప్రయాణిస్తున్న కారును  ఆపారు. కారు క్యాబిన్ లో తనిఖీ చేయగా 90  కిలోల గంజాయి దొరికింది. నిందితులిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 90 కిలోల గంజాయితో పాటు కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించి కోర్టులో హాజరుపరిచారు.