అజిత్ పవార్ కొడుకుపై భూకుంభకోణం ఆరోపణలు.. దర్యాప్తుకు సీఎం ఆదేశం

అజిత్ పవార్ కొడుకుపై భూకుంభకోణం ఆరోపణలు..  దర్యాప్తుకు సీఎం ఆదేశం
  • అక్రమాలు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి
  • పుణే తహసీల్దార్ పై సస్పెన్షన్
  • రూ.1,804 కోట్ల భూమిని రూ.300 కోట్లకే కొన్నట్లు ఆరోపణలు

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్  పవార్  కొడుకు పార్థ్ పవార్ పై వచ్చిన భూకుంభకోణం ఆరోపణలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  దర్యాప్తుకు ఆదేశించారు. అవినీతి, అక్రమాలను తమ ప్రభుత్వం సహించదని గురువారం ఒక ప్రకటనలో సీఎం స్పష్టం చేశారు. ‘‘అజిత్ పవార్  కొడుకు పార్థ్  పవార్  నిజంగా భూకుంభకోణానికి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిజంగా అక్రమాలు జరిగాయో లేదో తేల్చేందుకు విచారణకు ఆదేశించాను. అదనపు చీఫ్  సెక్రటరీ (రెవెన్యూ) వికాస్  ఖర్గే నేతృత్వంలో కమిటీ వేశాం. 

కేసు గురించి మరింత సమాచారం ఇవ్వాలని రెవెన్యూ, ల్యాండ్  రికార్డ్స్‌‌  అధికారులను ఆదేశించాను. దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం” అని ఫడ్నవీస్  తెలిపారు. ఈ కేసుపై సీఎం దర్యాప్తుకు ఆదేశించిన కొన్ని గంటల్లోనే పుణే తహసీల్దార్  సూర్యకాంత్  యెవాలానే సస్పెండ్  చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. పార్థ్  పవార్ కు చెందిన అమీదియా హోల్డింగ్స్  ఎల్ఎల్ పీ కంపెనీ.. పుణేలోని కోరేగావ్  పార్కులో రూ.1804 కోట్ల విలువైన 40 ఎకరాలను రూ.300 కోట్లకే కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ భూమి కొన్నట్లు డీల్  జరిగాక ఆ కంపెనీకి స్టాంప్  డ్యూటీ కూడా మినహాయించారని, ఆ కంపెనీ రూ.500 స్టాంప్  డ్యూటీ మాత్రమే చెల్లించిందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. 

మహర్  కమ్యూనిటీకి ఇచ్చిన ‘వతన్’ కేటగిరి కిందికి భూమి వస్తుందని, బాంబే ఇన్ఫీరియర్  విలేజ్  వతన్  రద్దు చట్టం 1958 ప్రకారం అనుమతి లేకుండా ఆ భూమిని అమ్మడంగానీ, కొనడంగానీ వంటివి చేయరాదని ప్రతిపక్ష నేతలు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి పార్థ్  పవార్  కంపెనీ ఆ భూమి కొనుగోలు చేసిందని మండిపడ్డారు. కొడుకు పార్థ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన తండ్రి, డిప్యూటీ సీఎం అజిత్  పవార్  వెంటనే రాజీనామా చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త అంజలి దమానియా డిమాండ్  చేశారు.

రూ.లక్ష క్యాపిటల్ తో ఎలా కొంటారు?

భూమి కొనేటపుడు అమీదియా కంపెనీ వద్ద రూ.లక్ష మూలధనం మాత్రమే ఉందని, అంత తక్కువ డబ్బుతో రూ.1804 కోట్ల విలువైన భూమిని ఆ కంపెనీ ఎలా కొనిందని శివసేన (యూబీటీ వర్గం) లీడర్  అంబదాస్  దాన్వే ప్రశ్నించారు. ఆ భూమిపై ఐటీ పార్కు, డేటా సెంటర్  నిర్మించడం కూడా ప్రారంభించారని ఆయన ఆరోపించారు.