ముఖానికి మాస్క్​తో .. ట్రైనీ ఐపీఎస్​కు యువతి న్యూడ్ కాల్

ముఖానికి మాస్క్​తో .. ట్రైనీ ఐపీఎస్​కు యువతి న్యూడ్ కాల్
  • వాట్సాప్‌‌ వీడియో కాల్​ను లిఫ్ట్‌‌ చేసిన ఆఫీసర్
  • వీడియో స్క్రీన్ రికార్డ్‌‌ చేసి  స్క్రీన్ షాట్లతో బ్లాక్‌‌మెయిల్‌‌ చేసిన సైబర్ నేరగాళ్లు
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత అధికారి

హైదరాబాద్‌‌, వెలుగు: ట్రైనింగ్‌‌లో ఉన్న ఓ  ఐపీఎస్‌‌ అధికారి సైబర్ నేరగాళ్ల ట్రాప్​లో చిక్కాడు.  న్యూడ్ కాల్‌‌ లిఫ్ట్‌‌ చేసి బ్లాక్‌‌ మెయిలర్లకు టార్గెట్‌‌గా మారాడు. సైబర్ నేరగాళ్లు యువతితో అతడికి న్యూడ్ కాల్ చేయించి.. వాటిని  స్క్రీన్‌‌ షాట్స్‌‌ తీసి సోషల్‌‌ మీడియాలో  వైరల్‌‌ చేస్తూ బ్లాక్‌‌మెయిల్‌‌ చేయడంతో బాధిత ఐపీఎస్‌‌ సైబర్‌‌ ‌‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో నెల రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ కేసుకు సంబంధించి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు దాచిపెడుతున్నారు. 75వ రెగ్యులర్ రిక్రూట్‌‌ బ్యాచ్‌‌కు చెందిన ప్రొబేషనరీ ఐపీఎస్‌‌కు గత నెల మొదటి వారంలో గుర్తు తెలియని నంబర్‌‌‌‌ నుంచి వాట్సాప్‌‌  వీడియో కాల్‌‌ వచ్చింది. ప్రొబేషనరీ ఆఫీసర్‌‌‌‌ ఆ కాల్‌‌ను లిఫ్ట్‌‌ చేసిన వెంటనే ముఖానికి మాస్క్‌‌ ధరించిన ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దీంతో అలర్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ వెంటనే ఆ కాల్ కట్ చేశాడు.  అప్పటికే సైబర్‌‌‌‌ నేరగాళ్లు తమ ఫోన్‌‌లో వీడియో స్క్రీన్‌‌ రికార్డ్‌‌ చేశారు.

తర్వాత వీడియోను స్క్రీన్ షాట్లు తీసి ట్రైనీ ఐపీఎస్​కు ఫోన్లు చేసి వేధించడం  మొదలుపెట్టారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్‌‌ చేస్తామని బెదిరించారు. అతడి ఫేస్​బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌ కాంటాక్ట్స్‌‌కి షేర్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. అయితే, సదరు ట్రైనీ ఐపీఎస్ ఆ బెదిరింపులను పట్టించుకోలేదు. దీంతో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ క్లిప్‌‌, స్క్రీన్‌‌ షాట్‌‌లను అతడి సోషల్ మీడియా అకౌంట్లలోని కాంటాక్ట్స్​కు షేర్ చేశారు.   డబ్బులు ఇవ్వాలని వేధింపులు పెరిగిపోవడంతో బాధిత ఐపీఎస్‌‌ ఆ నంబర్‌‌‌‌ను బ్లాక్ చేశాడు.

అయినప్పటికీ వివిధ నంబర్ల నుంచి కాల్స్‌‌ చేస్తూ వీడియో క్లిప్​లు, స్క్రీన్ షాట్లను పంపించారు.  వీడియో క్లిప్‌‌ను ఫేస్‌‌బుక్‌‌లో షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆ అధికారి తన సోషల్ మీడియా అకౌంట్స్‌‌ అన్నింటినీ డీయాక్టివేట్ చేశాడు. సైబర్‌‌క్రైమ్‌‌ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేశారు.  వెస్ట్ బెంగాల్​కు చెందిన గ్యాంగ్​గా అనుమానిస్తున్నారు. ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.