 
                                    అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: వాగులో భార్యాభర్తలు గల్లంతు కాగా భార్య మృతిచెందగా.. భర్త ప్రాణాపాయం నుంచి స్థానిక యువకుల సాయంతో బయటపడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బాటసింగారం పెద్దవాగులో గురువారం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన ప్రభాకర్, కృష్ణవేణి దంపతులు. కృష్ణవేణి తల్లి గారిది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని నెర్రపల్లి గ్రామం.
కృష్ణవేణి తండ్రి రవీందర్ ఐదు రోజుల క్రితం మృతిచెందాడు. అస్తికలు గంగలో కలిపేందుకు కృష్ణవేణి ప్రభాకర్ దంపతులు నెర్రపల్లికి వచ్చారు. అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా నందనం గ్రామానికి బైకుపై బయల్దేరారు. బాటసింగారం – మజీద్ పూర్ మధ్యలో పెద్దవాగు వద్దకు రాగానే కృష్ణవేణి బ్యాగు వాగులో పడిపోయింది.
ఆ బ్యాగును అందుకునే క్రమంలో బైకుతో సహా దంపతులిద్దరు వాగులో కొట్టుకుపోయారు. గమనించిన స్థానిక యువకులు వారిని కాపాడి యబటికి తీసుకొచ్చారు. స్పృహ కోల్పోయిన కృష్ణవేణిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రభాకర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

 
         
                     
                     
                    