యాచించిన డబ్బుతో అన్నదానం

యాచించిన డబ్బుతో అన్నదానం

సుల్తానాబాద్, వెలుగు: యాచించే చేతులే అన్నదానం చేశాయి. బువ్వ కోసం తాను పడిన బాధను తోటివారికి ఒక్కరోజైనా దూరం చేద్దామనుకున్న ఓ యాచకురాలు గుడి మెట్లపై కూర్చొని భక్తులు ఇచ్చే చిల్లరను పోగు చేసి అన్నదాన కార్యక్రమంలో భాగమైంది. కరోనా నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద సామాజిక కార్యకర్త రాజకుమార్ కొందరు దాతల సహకారంతో 117 రోజులుగా అనాథలు, నిరుపేదలు, యాచకులకు అన్నదానం చేస్తున్నారు. అక్కడే భిక్షం ఎత్తుకునే లచ్చవ్వ అనే యాచకురాలు కూడా ఆ ఫుడ్​ ప్యాకెట్లతో రెండు పూటలా పొట్ట నింపుకుంటోంది. ఈ క్రమంలో తాను కూడా ఒకరోజు అన్నదానంలో భాగమవ్వాలని భావించిన వృద్ధురాలు.. యాచించగా వచ్చిన రూ.2వేలతో బుధవారం తోటివారికి అన్నదానం చేసింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి ఆమెను శాలువాతో సత్కరించారు. ప్రపంచ మానవతా దినోత్సవం నాడే వృద్ధురాలు అన్నదానం చేయడం విశేషం.