12 ఏండ్ల బాలిక సేవాగుణం..అనాథాశ్రమంలో లైబ్రరీ ఏర్పాటు

12 ఏండ్ల బాలిక సేవాగుణం..అనాథాశ్రమంలో లైబ్రరీ ఏర్పాటు

పద్మారావునగర్, వెలుగు : బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్​స్కూల్​లో 8వ తరగతి చదువుతున్న ఆకర్షణ(12) చిన్నతనంలోనే సేవా గుణాన్ని చాటుతోంది. ప్రత్యేక చొరవతో బోయిగూడలోని బాలికల ఆగ్జలియమ్​నవజీవన అనాథాశ్రమంలో ఓపెన్​లైబ్రరీని ఏర్పాటు చేసింది. శనివారం అధికారులతో కలిసి ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆకర్షణ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పోలీస్​స్టేషన్లు, బాలికల జువైనల్​హోంలు, ప్రభుత్వ బడుల్లో 13 లైబ్రరీలను ప్రారంభించినట్లు తెలిపింది. మొత్తం 25 లైబ్రరీలు ఏర్పాటు చేయాలని టార్గెట్​పెట్టుకున్నట్లు వివరించింది.

ఇప్పటివరకు మొత్తం 8,400 పుస్తకాలు సేకరించినట్లు వెల్లడించింది. 2021లో ఎంఎన్ జే క్యాన్సర్​ హాస్పిటల్​లోని చిన్నారులు అడిగిన కలర్​ఫుల్​ ఫొటోలతో కూడిన పుస్తకాలను ఇచ్చానని, ఆ టైంలో హాస్పిటల్​నిర్వాహకులు పుస్తకాలు సేకరించి లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సూచించారని చెప్పింది. అప్పటి నుంచి లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. లైబ్రరీల ఏర్పాటు విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ర్టపతి ద్రౌపది ముర్ము మెచ్చుకున్నారని

మోదీ స్వయంగా 2 వేల పుస్తకాలు పంపించారని వెల్లడించింది. కార్యక్రమంలో యూనిసెఫ్​ప్రోగ్రాం మేనేజర్​డేవిడ్​రాజ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధి తన్నీరు ప్రమోద, డీసీపీఓ శ్రీనివాస్, రిటైర్డ్​లైబ్రరీ అసిస్టెంట్ టీవీ ప్రఫుల్లా చంద్ర, అనాథాశ్రమ నిర్వాహకులు, ఆకర్షణ తండ్రి సతీశ్​కుమార్ పాల్గొన్నారు.