కాంగ్రెస్ లో మరో పంచాయతీ

కాంగ్రెస్ లో మరో పంచాయతీ
  • ఉత్తమ్ వర్సెస్ రేవంత్ మధ్య నిరసన చిచ్చు
  • ప్రియాంకా పర్యటన ముందు మరోసారి బయటపడిన రేవంత్, ఉత్తమ్ మధ్య విభేదాలు 
  • తనకు తెల్వకుండా నల్గొండలో సభ ఎలా ప్రకటిస్తరంటూ ఉత్తమ్ అభ్యంతరం
  • రేవంత్ తీరుపై ఠాక్రేకి ఫిర్యాదు చేసిన నల్గొండ ఎంపీ
  • 21న మహాత్మా గాంధీ వర్సిటీలో సభ ఉంటుందన్న రేవంత్

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య నిరుద్యోగ నిరసన సభ చిచ్చు రాజేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగ నిరసన దీక్షలకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఏప్రిల్ 21న నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో‌ సభ ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అక్కడే అసలు వివాదం మొదలైంది.‌ నల్గొండ జిల్లా నేత, ఎంపీనైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సభ ఉంటుందంటూ ఎలా ప్రకటిస్తారని ఉత్తమ్ అసహనం‌ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేకు ఫిర్యాదు చేశారని సమాచారం. తనకు తెలియకుండా సభ ఎట్లా పెడ్తారని అభ్యంతరం‌ వ్యక్తం చేశారు. వాస్తవానికి నిన్నటి (ఏప్రిల్ 18న) రేవంత్ ప్రెస్‌మీట్‌లో నల్గొండ జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పాల్గొనడం‌ గమనార్హం.

రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇప్పటికే ఆయన వ్యతిరేక వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. మొన్నటి మంచిర్యాల సభలోనూ కొందరు నేతలు‌ రేవంత్‌తో అంటీముట్టనట్టే ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేత అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోనూ రేవంత్ సంబంధాలు అంతంతే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉత్తమ్, రేవంత్ మధ్య తాజాగా రేగిన ఈ దుమారం హాట్ టాపిక్ గా మారింది.  అయితే.. రేవంత్ మాత్రం‌ తానేమీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ పార్టీ అంతర్గత చర్చల్లో చెబుతూ వస్తున్నారు. కానీ... వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన వ్యతిరేక వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రియాంకా గాంధీ‌ ముఖ్య అతిథిగా మే 4 లేదా 5న సభ నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో‌ ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఇలా వివాదం రేగడంపై‌ కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది.