విశ్లేషణ: రష్యాపై ఉక్రెయిన్​ యుద్ధంతో.. మనపై ఎఫెక్ట్ ఎంత?

విశ్లేషణ: రష్యాపై ఉక్రెయిన్​ యుద్ధంతో.. మనపై ఎఫెక్ట్ ఎంత?

రష్యా–ఉక్రెయిన్​ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఒకవైపు శాంతి చర్చలు నడుస్తున్నా.. యుద్ధం కారణంగా రెండు దేశాలకూ భారీ ఆస్తి, ప్రాణ నష్టం మాత్రం కలిగింది. అయితే ఈ వార్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీని వల్ల ఆ రెండు దేశాలపైనే కాదు.. ప్రపంచ దేశాలపైన కూడా పెను ప్రభావం పడనుంది. ఆ దేశాల నుంచి పెట్రోల్, ఇతర ముడి పదార్థాలు, ఆహార పదార్థాలు చాలా దేశాలకు ఎగుమతి అవుతాయి. ఈ యుద్ధం వల్ల రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఎగుమతులు ఆగిపోయాయి. దీని వల్ల అనేక రకాల వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మన దేశంలోనూ ద్రవ్యోల్బణంపై ఇది ప్రభావం చూపనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకోకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకూ రష్యా, ఉక్రెయిన్​ మధ్య శాంతి నెలకొనే దిశగా ప్రపంచ దేశాలు, యునైటెడ్ నేషన్స్​ అడుగులు వేయాలి.

కొంత కాలంగా నలుగుతున్న సమస్య తీవ్ర స్థాయికి చేరడంతో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించింది. ప్రధానంగా ఎయిర్​పోర్ట్స్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో చాలా ఆస్తి నష్టం జరిగిందని, ఎంతో మంది ప్రజల ప్రాణాలు పోయాయని ఉక్రెయిన్​ ప్రకటించింది. ఈ దాడులను  అమెరికా, మరికొన్ని దేశాలు ఖండించాయి. ప్రపంచ దేశాలు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. రెండు దేశాల మధ్య దాడులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమో అన్న భయంతో సంధి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే రష్యా దాడులను తప్పుబట్టిన యునైటెడ్​ నేషన్స్​.. సైన్యాన్ని వెనక్కి రప్పించాలని సూచించింది. అలాగే యుద్ధం ఆగకపోతే దాదాపు 70 లక్షల మంది వలస వెళ్లిపోవాల్సి వస్తుందని ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ ఆందోళన చెందుతోంది.

 ఇండియాలో ఆర్థిక వ్యవస్థపై భారమే

రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం మొదలైనప్పటి నుంచీ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్​ కూలిపోవడం మొదలయ్యింది. మనదేశానికి రష్యా, ఉక్రెయిన్​ నుంచి దిగుమతి అయ్యే పలు రకాల ఆహార పదార్థాలు, పెట్రోల్, ఇతరత్రా వస్తువులు తీసుకువచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచంలో ఉత్పత్తయ్యే గోధుమల్లో నాలుగో వంతు రష్యా, ఉక్రెయిన్ నుంచే వస్తుంది. యుద్ధం వల్ల ఈ ప్రాంతం నుంచి రవాణా స్తంభించి పోయింది. ఇక ఈ రెండు దేశాల నుంచి ఎక్కువగా ఇతర దేశాలకు పంపిణీ అయ్యే ముడి సరుకులు ముఖ్యంగా గ్యాస్, ముడి చమురు దిగుమతి తగ్గిపోయే అవకాశం ఉంది. రష్యా సేనలు అన్ని రంగాల్లో ఆరితేరి ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్​లోని 18 ప్రధాన ఆయుధాగారాలను రష్యా ధ్వంసం చేసింది. భారత్ కు రష్యా, అమెరికా దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు రష్యాలోని ఎనర్జీ సంస్థల్లో మన దేశం పెట్టుబడులు పెట్టగా.. కోల్, గ్యాస్, ఆయిల్, డిఫెన్స్ అవసరాల కోసం ఆ దేశంపై మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం. గతంలో రష్యా నుంచి భారత్ కొన్న S-400 ట్యాంకులపై అమెరికా వెసులుబాటు కల్పించినప్పటికీ.. రానున్న కాలంలో ఆ సడలింపులు ఉండకపోవచ్చు. ఈ టైంలో భారత్ రెండు దేశాలకు సమానమైన స్థానాన్ని ఇస్తూ దౌత్యపరంగా ముందుకు సాగడం సవాల్​తో కూడుకున్న అంశమే. యుద్ధం పరిస్థితుల కారణంగా దేశంలో ఆహార పదార్థాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం ద్రవ్యోల్బణంపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. అది మరింత పెరిగితే ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. ఇది ప్రజల పైనా మోయలేనంత భారంగా మారుతుంది.

ప్రపంచ దేశాల ఎకానమీకి చిక్కులు

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వస్తున్నా పుతిన్‌‌‌‌‌‌‌‌ పంథా మాత్రం మారలేదు. రష్యా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల కోసం అమెరికన్ డాలర్ల పై ఆధారపడాల్సిన అగత్యాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. అయితే ఉక్రెయిన్​ని ఊపిరి పీల్చుకోకుండా రష్యా దాడులు చేస్తూనే ఉంది. రాజకీయపరంగా సాగుతున్న ఈ వ్యూహాత్మక క్రీడ భారతదేశానికి చిక్కులు తెచ్చి పెట్టే ప్రమాదం కూడా ఉందని పలువురు నిపుణులు అంటున్నారు. రష్యా– ఉక్రెయిన్  మధ్య జరుగుతున్న భీకర పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న దేశాలను బలహీన పడేలా చేసే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఆర్థికంగా నిలదొక్కుకుని నిలబడగలిగే శక్తి వాటికి లేకపోవడమే దీనికి కారణం. గ్యాస్, ఇతర సహజవాయువు, ఆహారపు దిగుమతులు ఈ దేశాల నుంచి వచ్చే ఇతర సహజ వనరులు రాకుండా కొన్ని రోజుల పాటు నిలిచిపోతాయి. ఇప్పటికైనా రష్యా, ఉక్రెయిన్  మధ్య శాంతి చర్చలు జరుపుకుని ప్రపంచ శాంతికి కారకులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. యుద్ధం ఏ దేశానికైనా నష్టమే. అయితే ప్రస్తుతం మనదేశంపై కూడా ఈ యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఉద్రిక్తతలను ఎంత వరకు తగ్గించగలిగితే ప్రపంచ శాంతి మనం అంత కాపాడగలుగుతాం. ప్రపంచ శాంతికి మనందరం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్

యుద్ధం కారణంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగస్తులు స్వస్థలాలకు వెళ్లాలంటే విమానాలు, ఎయిర్ పోర్టులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ ప్రజలందరూ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయాందోళనతో కాలం గడుపుతున్నారు. అయితే రష్యా – ఉక్రెయిన్​ మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అని ఆయా దేశాల అధినేతలు, అధికారులు అంచనా వేస్తున్నారు. మనదేశం కూడా రెండు దేశాల మధ్య యుద్ధాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లో చదువుకుంటున్న మన స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ను సేఫ్​గా స్వదేశం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.

- డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ