హైదరాబాద్ పరిస్థితి: భారతీయుల తలసరి ఆదాయం కంటే నర్సరీ స్కూల్ పిల్లోడి ఫీజు ఎక్కువ..!

హైదరాబాద్ పరిస్థితి: భారతీయుల తలసరి ఆదాయం కంటే నర్సరీ స్కూల్ పిల్లోడి ఫీజు ఎక్కువ..!

ప్రజల సంపాదన కంటే ఖర్చులు వేగంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది ప్రస్తుతం ఉన్న శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే. కానీ నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ కంటే మంచి విద్య, వైద్యం సహా జీవితాన్ని ఇవ్వాలనే ఆశతో తమ ఆదాయాల కంటే ఎక్కువగా పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్లు దొరికిన కాడికి దోచేస్తున్నాయి భారీ ఫీజులతో. దీనిపై సుజన్ యు అనే అనలిస్ట్ ఆసక్తికరమైన అంశాలను తన లింక్డిన్ పోస్టులో పంచుకోవటం తెగ వైరల్ అవుతోంది. 

సుజన్.. హైదరాబాదులోని ఒక స్కూలులో నర్సరీ పిల్లోడిని చదివించటానికి అవుతున్న ఫీజులకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ షేర్ చేశారు. అందులో అన్ని రకాల ఫీజులు కలుపుకుని రూ.2లక్షల 50వేలు ఏబీసీడీలు నేర్చుకునే పిల్లోడి చదువుకు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది నగరాల్లో విద్య ఎంత ఖరీదైనదిగా మారుతుందనే విషయాన్ని తెలియజేస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సదరు హైదరాబాదీ స్కూల్ వసూలు చేస్తున్న ఫీజు కంటే దేశ ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఏడాదికి రూ.2లక్షల 40వేలుగా ఉండటమే. అది కూడా జస్ట్ పిల్లోడికి నర్సరీ ఎడ్మిషన్ కోసం కావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

ALSO READ : తగ్గనున్న పన్నుల భారం..

తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఖరీదైన స్కూల్స్ కి పిల్లలను పంపించటంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక లగ్జరీ వస్తువుగా మారిపోతుందన సుజన్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్ల పిల్లోడే తమ కస్టమర్ గా మార్చుకుంటూ వ్యాపారం చేస్తున్న స్కూల్స్ వారి తల్లిదండ్రులను తమ అధిక ఫీజులతో అప్పులపాలు చేస్తున్నాయని అనలిస్ట్ అన్నారు. కానీ చట్టాలు, ప్రభుత్వాలు వీటిని నిరోధించటానికి పనిచేయటం లేదని ఈ పరిస్థితిలు విద్యకు అవరోధాలుగా మారుతున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను రెగ్యులేట్ చేయాలా లేక వారు అడిగినంత చెల్లించాలా అని ప్రశ్నించారు సుజన్. 

దాదాపు 40 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను దేశంలో ప్రైవేటు స్కూళ్లకే పంపిస్తున్నారు. కానీ పదేళ్లలో సంస్థలు తమ ఫీజులను 200 శాతానికి పైగా పెంచాయన్నారు సుజన్. ప్రభుత్వం దేశ జీడీపీలో 4 శాతం విద్యకు కేటాయిస్తుంటే.. చాలా దేశాల్లో ఇది 7 శాతంగా ఉందన్నారు. ప్రభుత్వాలు క్వాలిటీ విద్యను అందించేందుకు ప్రయత్నిస్తే ప్రైవేటు రంగంలోని సంస్థల వైపు తల్లిదండ్రులు మెుగ్గుచూపని అంటున్నారాయన.