‘రేఖాచిత్రం’ లాంటి పలు మలయాళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అనస్వర రాజన్... ‘ఛాంపియన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించిన ఈ చిత్రంలో డిసెంబర్ 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనస్వర మాట్లాడుతూ ‘‘ఛాంపియన్’ కథ వినగానే ఎమోషనల్‌గా అనిపించింది.
ఒక మంచి సినిమాకి ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. నిజానికి ఇలాంటి వింటేజ్ పీరియడ్ సినిమాలు చేయడం నాకు ఇష్టం. ఒక ప్రేక్షకురాలిగా ఇలాంటి సినిమాలు చూడటానికి నేను ఇష్టపడతాను. ఆ కాలం కాస్ట్యూమ్స్ వేసుకోవడం సహా మనం నిజ జీవితంలో అనుభూతి చెందలేనివి కొన్ని ఇందులో ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అందుకే చంద్రకళ క్యారెక్టర్ కోసం రెడీ అవ్వడం ఎంతగానో నచ్చింది.
ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే క్యారెక్టర్ అవుతుంది. రోషన్ స్వీటెస్ట్ కోస్టార్. డైలాగ్స్, డాన్స్ విషయంలో చాలా సపోర్ట్ చేశారు. తెలుగు రాకపోవడం నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయినప్పటికీ దర్శకుడు ప్రదీప్ గారి సపోర్ట్‌తో పర్ఫెక్ట్‌గా చేయగలిగాను. నిర్మాత స్వప్న గారి నుంచి నాకు చాలా సపోర్టు లభించింది. మిక్కీ జే మేయర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటల్లో గిరగిర పాట నా ఫేవరేట్.
ఇక మా సినిమా ట్రైలర్‌ను రామ్ చరణ్ గారు లాంచ్ చేయనుండటం ఆనందంగా ఉంది. ఆయన నటించిన ‘మగధీర’ సినిమా నాకెంతో ఇష్టం. ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. అలాగే తెలుగులో అల్లు అర్జున్ గారంటే చాలా ఇష్టం. ప్రస్తుతం తెలుగులో ‘ఇట్లు మీ అర్జున’ చిత్రం చేస్తున్నా. ఇక కెరీర్ ప్రారంభంలోనే మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు లాంటి లెజెండరీ యాక్టర్స్‌తో కలిసి నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా” అని చెప్పింది.
