అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి : మంత్రి జూపల్లి కృష్ణారావు

అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి జూపల్లి 

హైదరాబాద్, వెలుగు: అందేశ్రీ రచనలు, సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన మన మధ్య లేకపోవడం తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన అందేశ్రీ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలు, రచనల ద్వారా యావత్ తెలంగాణ సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప ప్రజాకవి అందేశ్రీ అని కొనియాడారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గేయం కోట్లాది మంది ప్రజల గొంతుకగా మారిందని గుర్తు చేశారు. కవులు, సాహితీవేత్తలు ఎన్ని పుస్తకాలు రాశారన్నది ముఖ్యం కాదని, వారి రచనలు సమాజానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయనేదే కీలకమని.. ఆ కోణంలో చూస్తే అందేశ్రీ అత్యున్నత ప్రజాకవిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ విమలక్క, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ వెన్నెల గద్దర్, చరణ్ కౌశిక్ యాదవ్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.