రాష్ట్రం వచ్చినా సెక్రటేరియట్ లో ఆంధ్ర పెత్తనమే..!

రాష్ట్రం వచ్చినా సెక్రటేరియట్ లో ఆంధ్ర పెత్తనమే..!

రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా సెక్రటేరియట్​లో వారి పెత్తనమేనా?

అసిస్టెంట్​ సెక్రటరీలుగా 24 మంది ఎస్​వోలకు పదోన్నతి.. తెలంగాణ ఉద్యోగుల గుస్సా

కమల్​నాథన్​ కమిటీ రూల్స్​ బేఖాతర్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రం వచ్చి ఐదేళ్లవుతున్నా సచివాలయంలో ఇంకా ఆంధ్ర అధికారుల పెత్తనమే సాగుతోందని సెక్రటేరియట్​ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కమల్​నాథన్​ కమిటీ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ మన అధికారులకు కాకుండా, ఏపీ అధికారులకు ప్రమోషన్లు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. కీలకమైన జీఏడీలో ఇంకా ఏపీ అధికారులే కీలక పోస్టుల్లో ఉన్నారని, ఆంధ్ర సెక్రటేరియట్​ను తలపిస్తోందన్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న 24 మంది ఏపీ సెక్షన్​ ఆఫీసర్లను (ఎస్​వో) అసిస్టెంట్​ సెక్రటరీలుగా ప్రమోట్​ చేసింది సర్కారు. దానిపై ఇప్పుడు వివాదం రాజుకుంది.

రాష్ట్ర విభజనలో భాగంగా ఆ ఏపీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. కానీ, తాము ఇక్కడ పనిచేయలేమని, ఏపీ సెక్రటేరియట్​కే వెళ్లిపోతామని వాళ్లు ఆప్షన్లు పెట్టుకున్నారు. అయితే, సొంత రాష్ట్రం వాళ్లే అయినా ఖాళీలు లేవన్న కారణం చూపి నాటి ఏపీ సర్కార్​ వారి ఆప్షన్లను తిరస్కరించింది. డ్యూటీలోకి తీసుకోబోమని తేల్చి చెప్పింది. దీంతో వాళ్లు మళ్లీ తెలంగాణకే వచ్చారు. ఇప్పుడు వెళ్లిపోతామన్న ఆ ఉద్యోగులకే ప్రమోషన్లు ఇవ్వడం వివాదానికి కారణమైంది. వారికి ప్రమోషన్లు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి చెందిన 20 మందికి మాత్రమే ప్రమోషన్లు వచ్చాయని, మిగతా 24 మంది నష్టపోయారని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ఉద్యోగుల ప్రమోషన్లపై హైకోర్టు ఆదేశాలివ్వగానే ఆగమేఘాలపై స్పందించిన సర్కారు, సొంత రాష్ట్ర ఉద్యోగుల విషయంలో స్పందించట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. సాగదీత, నాన్చివేత ధోరణితో ముందుకెళుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏపీ ఉద్యోగులకో నీతి, తమకో నీతి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ద్వారా ఎంపికైన ఏఎస్​వోల సీనియారిటీ జాబితాను సెప్టెంబర్​లోపు సిద్ధం చేయాలని హైకోర్టు ఆదేశించినా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. తమకు ఇవ్వకుండా ఏపీ వాళ్లకు ఎలా ఇస్తారని ఏఎస్​వోలు మండిపడుతున్నారు. నిజానికి ఈ తప్పు విభజన టైంలోనే జరిగిందంటున్నారు ఉద్యోగులు. విభజనప్పుడు రాష్ట్రానికి వందలాది మంది ఏపీ ఉద్యోగులను కేటాయించారు. అందులో ఆఫీసర్​ స్థాయి ఉన్నోళ్లే ఎక్కువ. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా, సీనియారిటీ జాబితా తయారు చేయాలని హైకోర్టు ఆదేశించినా, సీఎస్​ చెప్పినా రెండు రాష్ట్రాల జీఏడీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అసలు విభజన చేసే టైంలోనే సీనియారిటీని గుర్తించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి