జెండా కోసం ఇల్లు అమ్మేశాడు

జెండా కోసం ఇల్లు అమ్మేశాడు
  • ఎలాంటి కుట్టు,అతుకు లేకుండా నేసి రికార్డు
  • తాను తయారు చేసిన జెండా ఎర్రకోటపై ఎగరాలని సంకల్పం
  • మగ్గంపై జాతీయ జెండా నేసిన నేత కార్మికుడు

ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన ఓ నిరుపేద చేనేత కార్మికుడు. ఎలాంటి కుట్టు, అతుకు లేకుండా ఏక వస్త్రంతో జాతీయ జెండాను తయారు చేయాలని ఫిక్స్‌‌ అయ్యాడు. పూర్తిగా చేనేత మగ్గంపైనే నేయాలనుకున్నాడు. పని మొదలుపెట్టాడు. తొలుత కొంచెమే ఖర్చు అవుతుందనుకున్నాడు. రూ.6.5 లక్షలవుతుందని తర్వాత అర్థమైంది. కానీ ఆశ వదులుకోలేదు. పట్టు వదల్లేదు. కల కోసం ఇంటినే అమ్మేశాడు. 8×12 అడుగుల జెండా రూపొందించాడు. ఏ వారంలోనో, నెలలోనో జెండా తయారవలేదు. సుమారు నాలుగేళ్లు పట్టింది.

ఎర్రకోటపై తాను చేసిన జెండా ఎగరాలని

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరానికి చెందిన చేనేత కార్మికుడు రుద్రాక్షుల రామలింగ సత్యనారాయణ. పుట్టింది పేద కుటుంబంలో. ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. ఎర్రకోటపై తాను తయారు చేసిన జెండా ఎగరాలని కలగన్నాడు. అందుకు దేశంలో ఇంతవరకు తయారు చేయని విధంగా జెండా రెడీ చేయాలనుకున్నాడు. ఎక్కడా అతుకు లేకుండా రూపొందించాలనుకున్నాడు. తయారీకి రూ.25 వేలు సరిపోతుందనుకున్నాడు. 4 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో జెండా తయారీకి సిద్ధమయ్యాడు. కానీ ఎర్రకోటపై ఎగిరే జెండా 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉంటుందని ఇంటర్నెట్‌‌ ద్వారా తెలుసుకున్నాడు.

ఆ సైజు మగ్గాలు ఇప్పుడెక్కడివి?

12x 8 సైజున్న మగ్గాలు ప్రస్తుతం లేవు. ప్రస్తుత మెషీన్ల సాధారణ సైజు నాలుగు ఫీట్లు. కానీ ఆయనకు 10 ఫీట్ల మగ్గం కావాలి. దీంతో పాత కాలం నాటి ఓ మగ్గం సంపాదించాడు సత్యనారాయణ. దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆచంట సెగ్మెంట్‌‌ వైసీపీ సమన్వయకర్త చెరకువాడ శ్రీరంగనాథరాజు రూ.2 లక్షలు సాయం చేశారు. దీంతో పని కొంత సులువైంది. ముందుగా గ్రాఫ్ గీసుకుని జెండాను నేయడం ప్రారంభించాడు. మూడు రంగులు, 24 రేకలు ఉండేలా 2,400 పట్టుదారాలతో చేనేతలోనే అద్భుతమైన జాంధాని, పైసాని వర్క్‌‌లతో జెండాను తయారుచేశాడు. కానీ మధ్యలో అశోక చక్రం సెట్ చేసేందుకు చాలా కష్టమైంది. వందలాది మీటర్ల దారం వేస్టయింది. అయినా,  ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని దారాలకు రంగులద్ది చివరికి సెట్‌‌ చేశాడు. పని పూర్తయ్యాక జెండా కిలో బరువుంది.

జెండా తయారీకి ‘లిటిల్ ఇండియన్స్’ షార్ట్ ఫిల్మ్ స్ఫూర్తినిచ్చిందని సత్యనారాయణ చెప్పారు. అందులోని యాక్టర్‌‌ అశోక చక్రాన్ని కుట్టకుండా దారాలతో కష్టపడి రూపొందించి జెండా తయారు చేసిన విధానం తననెంతో ఆకట్టుకుందన్నాడు. ఇటీవల ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా కొందరు నేతల సాయంతో ఆయన్ను కలుసుకున్నాడు. తాను తయారు చేసిన జెండాను గిఫ్టుగా ఇచ్చాడు. కానీ జెండా గురించి మాత్రం చెప్పలేకపోయాడు. ‘జెండా ప్రత్యేకతను ప్రధాని గుర్తించారో లేదో’ అని సత్యనారాయణ అన్నాడు. తాను నేసిన జెండా ఎర్రకోటపై ఎగరాలని సత్యనారాయణ బలంగా ఆకాంక్షిస్తున్నాడు.

రూ. 15 లక్షల సరుకు నాశనమైనా..

మామూలుగా సత్యనారాయణ చీరలు నేస్తుంటాడు. అక్కడ సుమారు 60 కుటుం బాల సాయంతో పని చేస్తున్నాడు. ఓసారి తాను నేయించిన సుమారు రూ.15 లక్షల విలువైన చీరలు నాశనమయ్యాయి . రవాణా చేస్తుండగా వెహికిల్‌‌ బోల్తా కొట్టి మురికి నాలాలో పడటంతో చీరలన్నీ మురికి నీటి పాలయ్యాయి . జెండా నేయడం సగానికొచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది. కానీ సంకల్పం వదల్లేదు. ఎర్రకోటపై ఎగరేసే జెండాలను కర్నాటకలోని హుబ్లీలో తయారుచేస్తారని సత్యనారాయణ తెలుసుకున్నా డు. ‘నేను జెండాను ఎలా తయారు చేస్తానో అధికారులకు చూపిం చాను. సరైన దారాలిస్తే వాళ్లకు ఓ జెండా తయారు చేసిస్తాను’ అన్నారు.