అభివృద్ధిలో ఏపీ, తెలంగాణ .. నార్త్, సౌత్ కొరియాల్లా ఉన్నయ్‌‌ : ‌ చంద్రబాబు

అభివృద్ధిలో ఏపీ, తెలంగాణ .. నార్త్, సౌత్ కొరియాల్లా ఉన్నయ్‌‌ :  ‌ చంద్రబాబు

న్యూఢిల్లీ, వెలుగు: అభివృద్ధిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నార్త్, సౌత్ కొరియాల మాదిరిగా ఉన్నాయని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ మోహన్‌‌ రెడ్డి విధానాల వల్లే తెలంగాణకు, ఆంధ్రాకి పొంతన లేకుండా పోయిందన్నారు. అభివృద్ధిలో ఏపీ తిరోగమనంలో పోతుంటే.. తెలంగాణ దూసుకుపోతున్నదని చెప్పారు. మం గళవారం ఢిల్లీలో చంద్రబాబు మీడి యాతో చిట్‌‌చాట్ చేశారు. తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీపై కమిటీ వేశామని, ఏయే స్థానాల్లో అభ్యర్థిని నిలపాలనే అంశాన్ని కమిటీ ఫైనల్ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుకు సంబంధించి సమయం మించిపోయిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం తెలంగాణ, కర్నాటకలో మాత్రమే కాంగ్రెస్ ఉందన్నారు. 

దేశ నిర్మాణంలో భాగం కావాలి..

ఇండియాకు ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ గుర్తింపు తెచ్చారని చంద్రబాబు అన్నారు. దేశంలో టెక్నాలజీ చాలా అడ్వాన్స్ స్టేజ్‌‌లో ఉందని, డీప్ డ్రైవ్ టెక్నాలజీస్ వినియోగంలోకి వస్తున్నాయని చెప్పారు. వ్యవసాయం, హెల్త్ రంగాల్లో ఈ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు చూడొచ్చని అభిప్రాయపడ్డారు. 1980 నుంచే టీడీపీ జాతీయ కూటమిల్లో భాగంగా ఉందన్నారు. ప్రస్తుతం ఏర్పడిన ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలని చెప్పారు. ఇండియా కూటమికి లీడర్ లేకపోవడం బీజేపీ కి కలిసొచ్చే అంశమన్నారు.