గుడివాడ పేదలకు గుడ్ న్యూస్.. .జూన్ 16న టిడ్కో ఇళ్లు పంపిణి

గుడివాడ పేదలకు గుడ్ న్యూస్.. .జూన్ 16న టిడ్కో ఇళ్లు పంపిణి

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి  జూన్  16న  కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు.  గుడివాడ మండలం మల్లాయపాలెం టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే బహిరంగ సభలో  ప్రసంగిస్తారు.  ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మల్లాయపాలెం చేరుకుంటారు. అక్కడ టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

టిడ్కో ఇళ్లు పంపిణి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడివాడలో టౌన్‌షిప్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి (టిడ్కో) ఇళ్లను జూన్ 16న లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గుడివాడ సమీపంలో 300 ఎకరాల్లో 8వేల 912 ఇళ్లను నిర్మించారు.  గుడివాడ టిడ్కో హౌసింగ్ లేఅవుట్ రాష్ట్రంలోనే అతిపెద్ద హౌసింగ్ డెవలప్‌మెంట్‌గా నిలుస్తుంది. టిడ్కో ప్రాజెక్ట్ లో  30,000 మందికి  గృహాలను పంపిణీ చేస్తున్నారు. ఈ ఇళ్ల  నిర్మాణం కోసం 2008లో 7.46 ఎకరాలు,  2009లో 32.04 ఎకరాలతో ఇంకా  అదనంగా 45.42 ఎకరాలు కేటాయించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.720.28 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.133.36 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.289.94 కోట్లు, లబ్ధిదారులు రూ.299.66 కోట్లు ముందస్తు విరాళాలు, బ్యాంకు రుణాల ద్వారా అందజేశారు.        

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గం కావడంతో ఆయన దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇప్పటికే నాలుగుసార్లు గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నాని.. ఇక్కడి నుంచి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదోసారి గెలుపుపై కన్నేశారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల వద్దకు బాగా తీసుకెళ్తున్నారు. అభివృద్ధి పనుల్ని కూడా వేగవంతం చేసి, నియోజకవర్గంలో మరోసారి తన ముద్ర వేసి ఇక తనకు తిరుగు లేకుండా చేయాలనే యోచనలో ఉన్నారు. ముఖ్యమంత్రితో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం ఏర్పాటు ఈయనే చేయించినట్లు తెలుస్తోంది.