ఢిల్లీకి సీఎం జగన్.. మోదీ, అమిత్ షాలతో భేటీ

ఢిల్లీకి సీఎం జగన్.. మోదీ, అమిత్ షాలతో భేటీ

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కన్ఫామ్ అయ్యింది. అక్టోబర్ 6వ తేదీ విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు ప్రధాన మంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు. చాలా కాలం తర్వాత సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెళ్లటం ఒకటి అయితే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీ పర్యటన చేస్తుండటంతో ఆసక్తి రేపుతోంది. దీనికితోడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సైతం.. అక్టోబర్ నెలలోనే వస్తుండటం.. అది కూడా ఆరు నుంచి ఏనిమిదో తేదీ మధ్యన రిలీజ్ కావొచ్చనే సమాచారం వస్తున్న క్రమంలోనే.. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ కన్ఫామ్ కావటం ఉత్కంఠ రేపుతోంది.

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికల 2024 ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏడు నెలల ముందు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాలతో భేటీ అవుతుండటంతో.. ఎన్నికలతోపాటు చంద్రబాబు అరెస్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

మోదీ తెలంగాణలో రెండు పర్యటనలు చేసిన తర్వాత.. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి మోదీని, అమిత్ షాలతో భేటీ అవుతుండటం.. అది కూడా అక్టోబర్ 6వ తేదీ కావటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు తెర తీసింది.