- ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు
- రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో ‘వాయుపుత్ర సదన్’ నిర్మాణానికి శంకుస్థాపన
- సీఎం రేవంత్ రెడ్డి పోరాటాల నేత అంటూ ప్రశంస
జగిత్యాల/కొండగట్టు, వెలుగు: కొండగట్టు ఆంజనేయ స్వామి తనకు పునర్జన్మనిచ్చాడని, అంజన్న సేవే తన జీవిత ధర్మమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఏ ఒక్కరి, ఏ ప్రాంతం సొత్తు కారని, ఆయన విశ్వాంతర్యామి అని పేర్కొన్నారు. ఆయనకు సేవ చేసే భాగ్యం కలగడం ఆనందంగా ఉందని తెలిపారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో శనివారం ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీటీడీ ఆధ్వర్యంలో రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ‘వాయుపుత్ర సదన్’ (96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండపం) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో హైటెన్షన్ వైర్ తగిలి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఘటనను గుర్తుచేసుకున్నారు. తాను ఎలా బతికానో ఇప్పటికీ తెలియదని చెప్పారు. ఆంజనేయ స్వామిపై తనకు అపారమైన భక్తి ఉందని, కొండగట్టులో మాల విరమణ చేసి నేరుగా తిరుపతికి వెళ్లడం భక్తుల ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. వారి కోసం సత్రాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు. ‘‘నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వసతులు కల్పించాలని అర్చకులు కోరారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంలో అంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి. ఇది స్వామివారి ఆజ్ఞ అనుకుని బలమైన సంకల్పంతో ఈ ప్రతిపాదనను టీటీడీ వారి ముందుంచాను. బోర్డు చాలా పెద్ద మనసుతో నిధులు మంజూరు చేసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ కొండగట్టులో గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు చేయాలని కోరారుఅందుకు నా వంతు సహకరిస్తా” అని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. పోరాటాలు చేసి సీఎం స్థానంలో కూర్చున్న నేత రేవంత్ రెడ్డి అని కొనియాడారు.
అలాగే, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉస్మానియూ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఉన్న రోజుల నుంచే తనకు పరిచయమని, అప్పట్లో తమకు ఒక గ్రూపు ఉండేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఏపీ ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పాల్గొన్నారు.
దశాబ్దం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం
దశాబ్దం తర్వాత తెలంగాణలో జనసేనకు దక్కిన విజయం ఇదేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శనివారం కొండగట్టు పర్యటన సందర్భంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజలకు బలమైన యువ నాయకత్వం అవసరమని, పంచాయతీల నుంచే అభివృద్ధి ప్రారంభమవుతుందన్నారు.
