గంటకు రూ.102.. జొమాటో డెలివరీ పార్ట్నర్ల సంపాదన

గంటకు రూ.102.. జొమాటో డెలివరీ పార్ట్నర్ల సంపాదన

న్యూఢిల్లీ: ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫారమ్​ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన డెలివరీ పార్ట్​నర్ల సంపాదన వివరాలను ఎక్స్ ​ద్వారా వెల్లడించారు. 2025లో డెలివరీ పార్ట్​నర్ల సగటు గంట సంపాదన రూ.102 కి చేరిందని చెప్పారు. ఇది 2024 లో ఉన్న రూ.92 తో పోలిస్తే 10.9 శాతం ఎక్కువని తెలిపారు. రోజుకు పది గంటల చొప్పున నెలకు 26 రోజులు పనిచేసే వారికి సుమారు రూ.26 వేలు వస్తాయని, ఖర్చులు పోను రూ.21 వేలు మిగులుతాయని వివరించారు.

బ్లింకిట్లో డెలివరీ పార్ట్​నర్ల సగటు వేగం గంటకు 16 కిలోమీటర్లు, జొమాటోలో 21 కిలోమీటర్లు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. పది నిమిషాల డెలివరీ అనేది స్టోర్లు దగ్గరగా ఉండటం వల్ల సాధ్యమవుతోంది తప్ప వేగంగా వెళ్లడం వల్ల కాదని పేర్కొన్నారు. 2025లో ఇన్సూరెన్స్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశామని, ఇందులో ప్రమాద బీమా, వైద్య బీమా వంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. మహిళా పార్ట్​నర్లకు నెలకు రెండు పెయిడ్ లీవులు కూడా ఇస్తున్నట్లు గోయల్​ వెల్లడించారు.