ఖమ్మం టౌన్, వెలుగు: మూసీ ప్రక్షాళన మహా యజ్ఞమని, అలాంటి ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి పూనుకుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుపడడం సరైంది కాదని సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని గిరిప్రసాద్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ మోదీ హీరో కావాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దైతే దేశంలో ఆకలి చావులు పెరుగుతాయని తెలిపారు.
సంపద కోసమే అమెరికా వెనెజువెలాపై దాడి చేసిందని ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై ట్రంప్ దాడి చేయడమేనన్నారు. ఈ నెల 18న సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సందర్భంగా చారిత్రక సభ నిర్వహిస్తామని తెలిపారు. లక్షలాది మందితో జరిగే ఈ సభలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పార్టీ నేతలు బాగం హేమంతరావు, సురేశ్, యర్రా బాబు, ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణ కుమార్ పాల్గొన్నారు.
