తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పొటెత్తారు. ఆదివారం వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం సంతానం కోసం జంపన్న నాగులమ్మకు ముడుపులు కట్టారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు.
గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, సారె, గాజులు, నిలవెత్తు బంగారం, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతరకు మరో 23 రోజులే ఉండడంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు మేడారం వచ్చే వాహనాలను కన్నెపల్లి మీదుగా దారి మళ్లించారు. గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం రెండు లక్షలకు పైగా భక్తులు వనదేవతలను దర్శనం చేసుకున్నట్లు ఎండోమెంట్ ఈవో మేకల వీరస్వామి తెలిపారు.
