కృష్ణా నీళ్లలో ఏపీ 38 టీఎంసీలు ఎక్కువ తీసుకుంది

కృష్ణా నీళ్లలో ఏపీ 38 టీఎంసీలు ఎక్కువ తీసుకుంది

హైదరాబాద్, వెలుగుకృష్ణా నీళ్లలో కేటాయింపుల కన్నా 38.56 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ అదనంగా తీసుకుందని, గాజులదిన్నె నుంచి తీసుకున్న నీటిని లెక్కల్లో చూపించలేదని కృష్ణా బోర్డుకు తెలంగాణ తెలిపింది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీకి లేఖ రాశారు. 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలకు అంగీకరించిన ఏపీ గత వాటర్ ఇయర్ (2019‌‌‌‌–20)లో 614.96 టీఎంసీలకు గాను 653.61 టీఎంసీలను తరలించుకుపోయిందని తెలిపారు. తెలంగాణ 316.79 టీఎంసీలు తీసుకోవాల్సి ఉండగా 278.14 టీఎంసీలు మాత్రమే తీసుకోగలిగిందని చెప్పారు. ఆ ప్రకారం ఏపీ కేటాయింపులకు మించి అదనంగా 38.56 టీఎంసీలను తరలించుకుపోగా, తెలంగాణ తక్కువ నీటిని తీసుకుందని వివరించారు.

లెక్కల్లో ఆ నీళ్లను చేర్చలేదు

కేఆర్ఎంబీ 12వ బోర్డు మీటింగ్ కు సమర్పించిన నీటి వినియోగ లెక్కల్లో గాజులదిన్నె నుంచి తీసుకున్న 1.45 టీఎంసీ నీటిని చూపించలేదని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఆ నీటిని కూడా ఏపీ తీసుకున్నట్లుగా లెక్కించాలని కోరారు. గత వాటర్ ఇయర్ యుటిలైజేషన్ లెక్కలను ఫైనల్ చేయడానికి ముందే రెండు రాష్ట్రాల మొత్తం వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బోర్డు కేటాయింపుల స్ఫూర్తిని మించి ఏపీ అదనంగా తీసుకున్న నీటి విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ గత వాటర్ ఇయర్లో ఉపయోగించుకోలేకపోయిన నీటిని ఈ వాటర్ ఇయర్​కు క్యారీ ఫార్వర్డ్ చేయాలని కోరారు.

తెలంగాణ వినియోగం ఇలా..

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ కల్వకుర్తి లిఫ్ట్ స్కీం ద్వారా 49.92 టీఎంసీలు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కు 16.51 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ ద్వారా 93.92 టీఎంసీలు, ఏఎమ్మార్పీ ద్వారా 43.48 టీఎంసీల నీటిని తీసుకుంది. చెన్నైకి తాగునీటికి ఇచ్చిన 1.66 టీఎంసీలను కలుపుకుంటే రెండు కామన్ రిజర్వాయర్లలో తెలంగాణ 205.51 టీఎంసీలను తీసుకుంది. ఇక ఇతర ప్రాజెక్టుల్లో జూరాల నుంచి 26.94, నెట్టెంపాడు నుంచి 12.22, భీమా నుంచి 13.69, కోయిల్​సాగర్ నుంచి 4.42,  ఆర్డీఎస్ నుంచి 5.93, మూసీ నుంచి 3.49, పాకాల నుంచి 2.48, వైరా నుంచి 2.92, లంకసాగర్ నుంచి 0.47, డిండి నుంచి 0.03 టీఎంసీలు తీసుకుంది. ఇతర ప్రాజెక్టుల నుంచి మొత్తంగా 72.62 టీఎంసీలు ఉపయోగించుకుంది.

ఏపీ వినియోగం ఇలా..

ఏపీ రెండు కామన్ రిజర్వాయర్ల నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 169.66 టీఎంసీలు, సాగర్ కుడి కాలువ ద్వారా 160.26 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా 37.61 టీఎంసీలు, కృష్ణా డెల్టా సిస్టంకు 152.36 టీఎంసీలు, హెచ్ఎన్ఎస్ఎస్ కు 41.91 టీఎంసీలు, ముచ్చుమర్రికి 5.41 టీఎంసీలు, గుంటూర్ కెనాల్ కు 3.15 టీఎంసీలు, చెన్నై వాటర్ సప్లయ్​కు 3.33 టీఎంసీలు తీసుకుంది. మొత్తంగా ఏపీ శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి 573.72 టీఎంసీలు వినియోగించుకుంది. ఇక తుంగభద్ర హైలెవల్ కెనాల్ నుంచి 30.19 టీఎంసీలు, లో లెవల్ కెనాల్ నుంచి 20.21, కేసీ కెనాల్ నుంచి 28.02, గాజులదిన్నె నుంచి 1.45 టీఎంసీలు  కలిపి ఇతర ప్రాజెక్టుల నుంచి ఏపీ మొత్తంగా 79.88 టీఎంసీల నీటిని తీసుకుంది.

జాగ్రత్తలు పాటిస్తే కొన్ని నెలల్లో కరోనా ఖతం