హైదరాబాద్‌లోని ఆంధ్రావాళ్లే ఏపీని ప్రశ్నించాలె

హైదరాబాద్‌లోని ఆంధ్రావాళ్లే ఏపీని ప్రశ్నించాలె

న్యూఢిల్లీ: ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ నేతలు మాట్లాడుతుంటే కొందరు సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. ఆంధ్ర ప్రజలపై తమకు కోపం లేదని శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రలో లేనటువంటి విధంగా తెలంగాణలో ఎంతో అభివృద్ధి, మెరుగైన పరిస్థితులు ఉన్నాయన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ప్రాజెక్టులు ఇస్తామని మభ్యపెట్టి.. పవర్‌లోకి రాగానే యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు జగన్ కూడా తండ్రిలాగే తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ నీటి పంచాయితీల వల్ల ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ గొడవలు జరుగుతున్నాయని.. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలని సూచించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే హైదరాబాద్‌‌లో ఉన్న ఆంధ్రావాళ్లు ఏపీని ప్రశ్నించాలన్నారు. 

‘తెలంగాణ నీటిని దోచుకెళ్లిన వైఎస్సార్‌ను దొంగ అనకుండా ఇంకేమనాలి? ఇప్పుడు జగన్ కూడా తండ్రిలాగే మన నీళ్లను దోచుకెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వం. పీజేఆర్‌ చావుకు వైఎస్సార్ కారణం కాదా? నక్సల్స్ పేరుతో తెలంగాణ ప్రజలను పొట్టన పెట్టకుంది వైఎస్సార్ కాదా? వైఎస్ తెలంగాణకు ఏం చేశారు? ఉద్యమంలో ఉన్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారు. మన భూములను దోచుకున్నారు. విద్యార్థులకు తక్కువ మార్కులు వేసి వారి భవిష్యత్‌పై దాడి చేశారు. తెలంగాణకు వైఎస్సార్ ఓ నరరూప రాక్షసుడు లాంటి వాడు. మన రాష్ట్ర వెనుకబాటుకు ఆయనే కారణం. పాలమూర్ నుంచి 14 లక్షల మంది వలస పోవడానికి వైఎస్సే కారణం. నవ్వుతూ నవ్వుతూ తెలంగాణకు ఆయన ద్రోహం చేశారు. వైఎస్ బతికుంటే తెలంగాణ రాకుండా అడ్డుకునే వారని ఆంధ్రావాళ్లే అనుకుంటారు’ అని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.