కేఆర్‌‌ఎంబీ మీటింగ్‌కు ఏపీ డుమ్మా.. అడ్డగోలు షరతులు విధిస్తూ గైర్హాజరు

కేఆర్‌‌ఎంబీ మీటింగ్‌కు  ఏపీ డుమ్మా..  అడ్డగోలు షరతులు విధిస్తూ గైర్హాజరు
  • ఈ నెల 10 తర్వాత మీటింగ్ పెట్టాలని బోర్డుకు లేఖ 
  • ఇకపై అన్ని సమావేశాలు విజయవాడలోనే పెట్టాలని కొర్రీలు 
  • ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోవాలని బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి 
  • రాష్ట్ర తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు ఇవ్వాలని వినతి

హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్​మేనేజ్‌మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) త్రీ మెంబర్ కమిటీ మీటింగ్‌కు ఏపీ డుమ్మా కొట్టింది. అడ్డగోలు షరతులు, కొర్రీలు పెడుతూ సమావేశానికి గైర్హాజరైంది. సోమవారం త్రీ మెంబర్​ కమిటీ మీటింగ్ నిర్వహిస్తామని ఈ నెల ఒకటో తేదీనే కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు సమాచారం పంపినా.. తీరా మీటింగ్​రోజు సమావేశానికి హాజరు కావట్లేదంటూ ఏపీ లేఖ పంపింది. ఈ నెల 2వ​తేదీతో లేఖ పంపినా.. ఆలస్యంగా సమాచారమిచ్చింది. 

తమకు ముఖ్యమైన సమావేశాలు ఉండడంతో త్రీ మెంబర్​కమిటీ మీటింగ్‌కు హాజరు కావట్లేదంటూ అందులో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టును ఎక్స్‌పర్ట్స్​ప్యానెల్ సందర్శిస్తున్నదని, 8వ తేదీ వరకు ఆ కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది. ఈ నెల 10 తర్వాత మీటింగ్​పెట్టాలని, ఇక మీదట పెట్టే మీటింగ్‌లన్నింటినీ విజయవాడలోనే నిర్వహించాలంటూ షరతులు విధించింది. 

ఏపీకి ఒక్క నెలకే 10 టీఎంసీలు కావాల్నట..  

జులై వరకు రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం 16 టీఎంసీల మేర ఇవ్వాలని బోర్డును తెలంగాణ కోరింది. మూడు నెలల అవసరాలకు ఆ నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కానీ, ఏపీ మాత్రం మే ఒక్క నెలకే 10 టీఎంసీల నీళ్లు ఇవ్వాలంటూ బోర్డును కోరడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా బోర్డు త్రీమెంబర్​ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసింది. బోర్డు సభ్యకార్యదర్శితో పాటు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉండే ఈ కమిటీ.. ఏటా ప్రతి సీజన్‌లోనూ సాగర్​, శ్రీశైలం ప్రాజెక్టుల కింద నీటి వాటాలు, అవసరాలపై చర్చించి పంపకాలు చేస్తుంటుంది. 

ఈసారి వేసవిలో తాగునీటి అవసరాలపై రెండు రాష్ట్రాలతో చర్చించేందుకు త్రీ మెంబర్​కమిటీ మీటింగ్​పెట్టినా.. ఏపీ మాత్రం అడ్డగోలు షరతులను పెట్టడం గమనార్హం. బోర్డు కార్యకలాపాలు హైదరాబాద్​ కేంద్రంగానే సాగుతున్నా.. ఏపీలో సమావేశాలు నిర్వహించాలంటూ పొరుగు రాష్ట్రం కొర్రీలు పెట్టింది. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ అనిల్​కుమార్​ హాజరయ్యారు. రాష్ట్ర అవసరాలను వివరించారు. అయితే, దాంతో పాటు బోర్డు ఏపీలో కార్యకలాపాలు నిర్వహించే అంశంపైనా కమిటీ మీటింగ్‌లో చర్చకు వచ్చినట్టు సమాచారం. విజయవాడలోనే తదుపరి సమావేశాలు నిర్వహించాలన్న ఏపీ వాదనకు బోర్డు కూడా మద్దతు తెలిపిందని తెలిసింది. 

ఏపీని కట్టడి చేయండి..

ప్రస్తుతం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి వాటాలు తెలంగాణకే ఇవ్వాలని బోర్డును ఈఎన్సీ అనిల్​కుమార్​ కోరినట్టు తెలిసింది. ఇప్పటికే ఏపీ తన కోటాను వాడుకున్నదని, మిగతా నీళ్లు తమ తాగునీటి అవసరాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో కలిపి 15 టీఎంసీల నీళ్లే ఉన్నాయని, తెలంగాణ అవసరాలకు 10.26 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 4.28 టీఎంసీలు పోనూ.. రెండు ప్రాజెక్టుల్లో మిగిలేది కేవలం 0.55 టీఎంసీలేనని బోర్డుకు వివరించారు. దీంతో నాగార్జునసాగర్​లో 510 అడుగుల దిగువకు (డెడ్​స్టోరేజ్​) ఏపీ పంపింగ్ సరికాదని ఈఎన్సీ తేల్చి చెప్పారు. 

ఏపీ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిందిగా గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే బోర్డు ఆదేశాల్లేకుండా సాగర్​కుడి కాల్వ, ముచ్చుమర్రి నుంచి ఏపీ నీటిని తరలించుకుండా కట్టడి చేయాలని ఆయన కోరారు. ఏపీ నీటిని తీసుకెళ్తే పూర్తి కోటా వాడుకోని తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని చెప్పారు. జులై 31 వరకు కల్వకుర్తికి 300 క్యూసెక్కులు, హైదరాబాద్​అవసరాలకు 750 క్యూసెక్కులు, ఖమ్మం జిల్లాకు 300 క్యూసెక్కులను ప్రతి రోజూ సరఫరా చేయాలని కోరారు. తెలంగాణ డిమాండ్లు, అభిప్రాయాలను బోర్డుకు ఆయన లిఖితపూర్వకంగా సమర్పించారు.

కేంద్ర జలశక్తి శాఖ సమావేశం వాయిదా

కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ 2 (కేడబ్ల్యూడీటీ 2/ బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్) అవార్డు అమలుపై 7న కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశం వాయిదా పడింది. పలు కారణాలతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు రాష్ట్రాలకు కేంద్రం సమాచారం పంపింది. సమావేశాన్ని మళ్లీ ఎప్పుడు ఏర్పాటు చేసేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​ 2010లోనే అవార్డు ఇవ్వగా.. అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

దీంతో అవార్డు అమల్లోకి రాలేదు. దీనివల్ల జలాల్లో హక్కులను కోల్పోతున్నామని కర్నాటక, మహారాష్ట్ర కూడా కోర్టుకు వెళ్లాయి. తాజాగా అవార్డును అమలు చేయాలని కోరుతూ రెండు రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాశాయి. ఈ నేపథ్యంలోనే కర్నాటక, మహారాష్ట్రతోపాటు తెలంగాణ, ఏపీలతోనూ సమావేశం కావాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. అనివార్య కారణాలతో సమావేశాన్ని వాయిదా వేసింది.