ఆంధ్ర స్టూడెంట్లకు తెలంగాణ మెడికల్ సీట్లు

ఆంధ్ర స్టూడెంట్లకు తెలంగాణ మెడికల్ సీట్లు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఇప్పటికీ ఆంధ్ర స్టూడెంట్లకు పెద్ద మొత్తంలో సీట్లు దక్కుతున్నాయి. రూల్స్ మారిస్తే కొత్త కాలేజీల్లోని సీట్లు అన్నీ తెలంగాణ స్టూడెంట్లకే దక్కే చాన్స్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే, రాష్ట్రం ఏర్పాటయ్యాక 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ 21 కాలేజీల్లో 2,550 ఎంబీబీఎస్‌‌ సీట్లు ఉన్నాయి. నిజానికి ఈ సీట్లన్నీ తెలంగాణ స్టూడెంట్లకే దక్కాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వ పట్టింపులేనితనం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో పూర్తిగా తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన కాలేజీల్లోనూ ఏపీ స్టూడెంట్లు అడ్మిషన్లు పొందుతున్నారు.

కౌన్సెలింగ్ నిబంధనల్లో మార్పులు చేసి, మొత్తం సీట్లను తెలంగాణ స్టూడెంట్లకే దక్కేలా చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా ఆలోచించకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అన్ని రకాల విద్యా సంస్థల్లో15 శాతం సీట్లను ఇరు రాష్ట్రాల స్టూడెంట్ల కోసం కేటాయించాలి. రెండు స్టేట్ల స్టూడెంట్స్ నుంచి అప్లికేషన్లు తీసుకుని, ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీట్లు కేటాయించాలి. అయితే, ప్రతిసారీ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే స్టూడెంట్ల సంఖ్య కంటే ఏపీ నుంచి ఇక్కడికి వచ్చే స్టూడెంట్ల సంఖ్య నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. దీంతో మన సీట్లు అన్నీ ఏపీ వాళ్లకు వెళ్తున్నాయని తెలంగాణ స్టూడెంట్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

ఛాన్స్ ఉన్నా రూల్స్ మార్చట్లే.. 

పాత కాలేజీల్లో ఏపీ స్టూడెంట్లను అనుమతించి, కొత్త కాలేజీల్లో పూర్తిగా లోకల్ స్టూడెంట్లకే సీట్లు దక్కేలా రూల్స్ మార్చుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ సర్కారు పట్టించుకోవట్లేదు.