హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆంధ్రా ఓట్ బ్యాంక్అంతా ఒకప్పుడు బీఆర్‌ఎస్ వైపే ఉండేది. గతంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్‌లో చేరడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రా ఓట్‌బ్యాంక్ క్రమంగా బీఆర్ఎస్ నుంచి పక్కకు పోతున్నదని చెబుతున్నారు. ఆ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లాయని అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ గ్రేటర్‌లోనూ పట్టు కోల్పోవడం ఖాయమని అంటున్నారు.
బీఆర్ఎస్ నేతల్లో నైరాశ్యం..
జూబ్లీహిల్స్ బైపోల్‌లో కచ్చితంగా గెలుస్తామని బీఆర్ఎస్ క్యాడర్ మొదటి నుంచీ అనుకున్నది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచే గెలుపు తమదే అన్న ధీమాలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గమంతా తిరిగి ప్రచారం చేశారు. ఈ నెల14 తర్వాత తెలంగాణలో రాజకీయ తుఫాన్రాబోతున్నదని, 500 రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటూ ప్రకటనలు చేశారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు సానుభూతి ఓట్లు పడతాయని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ అలా జరగలేదు. ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. దీంతో ఓటమి ఎదురుకావడంతో బీఆర్ఎస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు.
