మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. ఆగస్ట్ నుంచి 183 అన్న క్యాంటీన్లు స్టార్ట్

మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. ఆగస్ట్ నుంచి 183 అన్న క్యాంటీన్లు స్టార్ట్

హైదరాబాద్ ,వెలుగు: మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు  స్కిల్ సెన్సస్ , ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వైఎస్ ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు, పెన్షన్ల పంపిణీ,  హైకోర్టు ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం సెక్రటెరియెట్ లో సీఎం చంద్ర బాబు అధ్యక్షతన తొలి  కేబినెట్ మీటింగ్ జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఐ అండ్ పీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించిందని తెలిపారు.పెన్షన్లు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని .. 65.30 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. టీచర్ల నియామకానికి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. 

నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి.. గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి చాలా తేడాలున్నాయని వివరించారు. అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ పెంపు వల్ల నెలకు రూ. 810 కోట్ల భారం పడనుందని..ఏడాదికి రూ. 33,709 కోట్లు పెన్షన్ల నిమిత్తం పంపిణీ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు.  స్కిల్ సెన్సస్ చేపడతామని చెప్పారు. 183 అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభించబోతున్నామని.. మిగిలిన 20 క్యాంటీన్లను తర్వాత ప్రారంభిస్తామని తెలిపారు. 

గంజాయి నివారణకు ఐదుగురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. పంచాయతీ, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి మండలి ఆదేశించదన్నారు. ఈ నెలాఖరు నుంచి  పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, శాంతి భద్రతలు, మద్యం, శాండ్ అండ్ మైన్ వంటి వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని పార్థసారధి పేర్కొన్నారు.