రెండేళ్ల తర్వాత వెస్టిండీస్ జట్టులో ఆండ్రీ రస్సెల్.. 2024 టీ20 వరల్డ్ కప్ ప్లాన్ అదిరిపోయిందిగా

రెండేళ్ల తర్వాత వెస్టిండీస్ జట్టులో ఆండ్రీ రస్సెల్.. 2024 టీ20 వరల్డ్ కప్ ప్లాన్ అదిరిపోయిందిగా

2024 లో స్వదేశంలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తుంది. దాదాపు రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ను ఇంగ్లాండ్ తో జరగబోయే 5 టీ20 ల సిరీస్ కోసం ఎంపిక చేశారు. చివరి సారిగా 2021 వరల్డ్ కప్ లో విండీస్ తరపున ఆడిన ఈ ఆల్ రౌండర్ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. డిసెంబర్ 12 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా   21 ఏళ్ల మాథ్యూ ఫోర్డే 15 మందిలో స్థానం సంపాదించాడు. 
 
ప్రస్తుతం రస్సెల్ UAEలో డెక్కన్ గ్లాడియేటర్స్ తరపున అబుదాబి T10 లీగ్‌లో అదరగొడుతున్నాడు. మంగళవారం నుంచి తొలి T20I జరగనున్నందున ఈ స్టార్ ఆల్ రౌండర్ ఈ వారం జట్టుతో జతకట్టనున్నాడు. రోవ్‌మన్ పావెల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. షాయ్ హోప్ వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపడతారు. 2020 తర్వాత లెఫ్ట్ హ్యాండర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చాడు. 

వన్డే జట్టులో లేని జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్‌ లు టీ20 జట్టులో ఎంపికయ్యారు. జాన్సన్ చార్లెస్, ఒబెడ్ మెక్‌కాయ్, ఓడియన్ స్మిత్,  ఒషానే థామస్ లను సెలక్టర్లు పక్కన పెట్టేసారు. మాకు విజయావకాశాలు ఇస్తాయని మేము భావించే జట్టును ఎంపిక చేశామని.. మేము మాపై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తామని సెలెక్టర్ డెస్మండ్ తెలిపాడు. 5 టీ20 ల సిరీస్ డిసెంబర్ 12 నుండి 21 వరకు జరగనుంది.  

వెస్టిండీస్ జట్టు:

రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్,  రొమారియో షెపర్డ్.