
- సొంత భవనాలు లేక ఇబ్బందులు
- చిన్నారులను పంపేందుకు జంకుతున్న తల్లి దండ్రులు
మెదక్, నిజాంపేట, శివ్వంపేట, వెలుగు: చిన్న పిల్లలను సంరక్షించి, విద్యాబుద్ధులు నేర్పేందుకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు అవస్థల మధ్య కొనసాగుతున్నాయి. వందలాది కేంద్రాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలు, పెంకుటిళ్లలో కొనసాగుతుండగా, భవనాలు ఉన్న చోట సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెదక్ జిల్లాలో నాలుగు మెదక్, రామాయంపేట, నర్సాపూర్, అల్లాదుర్గంలో నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,076 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో 7 నుంచి ఏడాది వయసున్న పిల్లలు 5,849 మంది పిల్లలు, ఏడాది నుంచి 3 ఏళ్ల వయసున్న పిల్లలు 22,044 మంది, 3 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలు 19,626 మంది, 5,481 మంది గర్భిణులు, 5,179 మంది బాలింతలు, 16,910 మంది కిశోర బాలికలు ఉన్నారు.
353 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 325 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తుండగా, 398 కేంద్రాలు సమీపంలోని ప్రభుత్వ స్కూళ్లు, దాతలు ఉచితంగా ఇచ్చిన భవనాలు, జీపీ భవనాల్లో కొనసాగుతున్నాయి. పెంకుటిళ్లలో సౌకర్యాలు లేక ఇబ్బందుల మధ్య కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల వర్షం వస్తే ఉరుస్తున్నాయి. కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఇరుకు గదులు ఉన్నాయి. టేక్మాల్ మండలం చంద్రుతండాలో భవనం లేక గ్రామ పంచాయతీ భవనంలోని ఓ గదిలో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని అంగన్వాడీలకు సొంత భవనాలు మంజూరైనా అసంపూర్తిగా ఉన్నాయి. నిజాంపేట మండలం రజాక్ పల్లిలో రూ.6 లక్షల వ్యయంతో చేపట్టిన అంగన్వాడీ భవనం స్లాబ్ వేసి వదిలి పెట్టారు. సరైన వసతులు లేవని పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు.
లింగోజిగూడ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీడబ్ల్యూవో
శివ్వంపేట మండలం లింగోజిగూడ అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారి హైమావతి తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడుతూ ప్రమాదకరంగా ఉండడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడి దానిని మరో బిల్డింగ్‌లోకి మార్చాలని సూచించారు. అనువైన భవనం దొరికే వరకు ప్రస్తుతమున్న అంగన్వాడీ కేంద్రం వరండాలో కొనసాగించాలని సూచించారు.
వర్షాకాలంలో ఉరుస్తుంది
మా ఊర్లో 12 ఏళ్ల కింద అంగన్వాడీ సెంటర్ కు బిల్డింగ్ కడుతామని స్లాబ్ వేసి వదిలేసిన్రు. మాకు ప్రైమరీ స్కూల్ లో ఒక రూమ్ ఇచ్చారు. అందులో 20 మంది పిల్లలను ఉంచడం, 12 మంది గర్భిణులకు సేవలందించడం ఇబ్బందిగా ఉంది. ఎప్పుడో కట్టిన బిల్డింగ్ కావడంతో అంగన్వాడీ సెంటర్ఉన్న రూమ్ వర్షాకాలంలో ఉరుస్తుంది.
మంగ, అంగన్వాడీ టీచర్, రజాక్ పల్లి
మస్తు తిప్పలైతుంది
మా మనుమరాలు అంగన్వాడీ స్కూల్ కు పోతుంది. బిల్డింగ్ పాతది కావడంతో అది ఎప్పుడు కూలిపోతదో అని టీచర్, పిల్లలందరినీ బయట కూసోపెడుతున్నరు. అంగన్వాడీ సెంటర్ నడిపిచ్చుడు వాళ్లకు మస్తు తిప్పలైతుంది.
శ్యామవ్వ, రజాక్ పల్లి