రాని భాష నేర్చుకుని వెలుగులు పంచుతున్న జ్యోతి

V6 Velugu Posted on Jul 30, 2021

చదువుకు దూరంగా, ఆకలికి దగ్గరగా ఉండే గొత్తికోయల జీవితాలకు ఆశాజ్యోతిలా వెలుగులు పంచుతోంది. గొత్తి కోయల కుటుంబాల్లో ఆడపడుచుగా ఉంటూ వాళ్లకు సేవలు చేస్తోంది. తెలుగు భాషే  తెలియని ఆ పిల్లల చేతులు పట్టి అ..ఆ.. లు దిద్దిస్తోంది. వాళ్ల భాష నేర్చుకుని మరీ వాళ్లకు అర్థమయ్యేలా చదువు చెప్తోంది. వాళ్లలో ఒకరిగా మారి, వాళ్ల జీవితాల్లో వెలుగు నింపుతోంది అంగన్‌‌‌‌వాడీ టీచర్‌‌‌‌‌‌‌‌ జ్యోతి. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లో మారుమూల అటవీ ప్రాంతంలో  గంగమ్మ కాలని, క్రాంతినగర్​, గట్టుమల్ల పల్లెలు ఉన్నాయి. ఈ పల్లెల్లో గొత్తి కోయలు నివసిస్తున్నారు. ఆ పల్లెలన్నింటికీ కలిపి 2013వ సంవత్సరంలో గంగమ్మ కాలనీలో మినీ అంగన్​వాడీ సెంటర్​ను ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఈ సెంటర్​లో పక్కనే ఉన్న మైలారం గ్రామానికి చెందిన భానోత్​ జ్యోతి అంగన్​వాడి టీచర్​గా జాయిన్​ అయ్యింది. గంగమ్మ కాలనీలో చిన్న పూరి గుడిసెలో సెంటర్​ను స్టార్ట్​ చేసింది. మొదట్లో సెంటర్‌‌‌‌‌‌‌‌కు పిల్లలు ఒక్కరూ రాలేదు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించినా పెద్దగా లాభం లేకపోయింది. పైగా వాళ్లకు తెలుగు రాదు. జ్యోతికి వాళ్ల భాష రాదు. దాంతో వాళ్ల భాషలోనే అవగాహన కల్పిస్తే మార తారేమో అనుకుంది. రోజులో ఎక్కువసేపు వాళ్లతో ఉంటూ భాష నేర్చుకుంది. వాళ్లలో ఒకరిగా మారి పోయింది. వారి సాదకబాధకాలు పంచుకుంది. ఈ జర్నీలో ఆమె భర్త రూప్లా కూడా ఆమెకు సాయంగా నిలిచాడు. జ్యోతి అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ కల్పించడం వల్ల అంతకుముందు అంగన్​వాడీ సెంటర్ గడప కూడా తొక్కని చిన్నారులు..  ఇప్పుడు ప్రతిరోజూ సెంటర్‌‌‌‌‌‌‌‌కు వస్తున్నారు. దాంతో దాతల సాయంతో పూరి గుడిసె స్థానంలో  ఒక గదిని కట్టించింది. 

వెళ్లలేని చోటకి..
గంగమ్మ కాలనీలో 28 కుటుంబాలు, క్రాంతి నగర్​లో 38 కుటుంబాలు, గట్టుమల్లలో మరో పది కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం 50 మంది గొత్తికోయల పిల్లలు సెంటర్​కు వస్తున్నారు. ఇందులో 19 మంది ప్రి– స్కూల్​ పిల్లలున్నారు. అయితే.. క్రాంతి నగర్​ నుంచి గంగమ్మ కాలనీకి రావాలంటే గుంతల రోడ్డు మీద ఐదు కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. అందుకే ఆ గూడెంలో చదువుకున్న యువకుడితో అక్కడి పిల్లలకు చదువు చెప్పేలా ప్లాన్​ చేసింది జ్యోతి. అయినా.. ప్రతి పది, పదిహేను రోజులకోసారి క్రాంతి నగర్​కు వెళ్లి పోషకాలున్న తినుబండారాలు ఇస్తుంటుంది.

ఫ్రూట్స్​, పౌష్టికాహారం 
క్రాంతి నగర్​, గంగమ్మ కాలనీల్లో 19 మందికి పైగా బాలింతలు, గర్బిణులున్నారు. వాళ్లకు ఇప్పటికీ పోషకాలున్న తిండి అందని ద్రాక్షనే. అందుకే తన భర్త సాయంతో వాళ్లకు అప్పుడప్పుడు ఫ్రూట్స్ తీసుకెళ్లి ఇస్తుంటుంది. వాటితోపాటు గవర్నమెంట్​ నుంచి వచ్చే పోషకాలున్న తినుబండారాలు కూడా ఇస్తుంటుంది. ఏఎన్​ఎం, ఆశ కార్యకర్తలతో కలిసి వాళ్ల హెల్త్​ కండీషన్‌‌‌‌ని చెకప్​ చేయిస్తుంటుంది. అత్యవసరమైతే తన భర్తతో కలిసి రాత్రి టైంలో కూడా ప్రజలకు సాయం చేస్తుంది. కొవిడ్​ టైంలో కూడా ప్రతిరోజూ వాళ్ల దగ్గరకు వెళ్లి అవగాహన కల్పిస్తూ అవసరమైన మెడిసిన్స్​ ఇచ్చింది. అంతేకాక మధ్యలో చదువు ఆపేసిన కొందరు స్టూడెంట్స్‌‌‌‌ని మళ్లీ స్కూలుకు వెళ్లమని అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ కల్పిస్తోంది. 

అసలు పని చేస్తానా అనిపించింది
అంగన్​వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌లో టీచర్​గా చేరాక గంగమ్మ కాలని, క్రాంతినగర్​లో ఉంటున్న గొత్తి కోయల పరిస్థితి చూసి భయమేసింది. నేను ఇక్కడ పనిచేయగలుగుతానా? అనుకున్నా. వాళ్ల పరిస్థితి చూసి జాలేసింది. ఎలాగైనా మార్పు తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఐసీడీఎస్​ సూపర్​వైజర్​, పీడీల సాయంతో నా ప్రయత్నం మొదలుపెట్టా. మినీ అంగన్​వాడీ సెంటర్​ కోసం దాతల సాయంతో గదిని కట్టించా. ఇప్పుడు నేను గొత్తికోయల్లో ఒకదాన్నైపోయా. వాళ్లు చేసుకునే పండుగలకు నన్ను తప్పకుండా పిలుస్తారు. వాళ్లకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. 
– జ్యోతి, మిని అంగన్​వాడి టీచర్​

::: పోతు రాజేందర్​, భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు 

Tagged study, Bhadradri Kothagudem, Anganwadi teacher

Latest Videos

Subscribe Now

More News