న్యూఢిల్లీ: అనిల్ ధీరూభాయ్ అంబానీ (ఏడీఏ) గ్రూప్ కంపెనీలైన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (ఆర్‌సీఎఫ్‌ఎల్)పై రెండు వేర్వేరు బ్యాంక్ మోసం కేసుల్లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఇందులో ఒక కేసులో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీ పేరు ఉంది.
ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌పై కేసులో, జై అన్మోల్ (అప్పటి డైరెక్టర్), మాజీ సీఈఓ రవీంద్ర శరద్ సుధాకర్ కలిసి యూనియన్ బ్యాంక్‌ను రూ.228 కోట్లకు మోసం చేసినట్లు సీబీఐ కేసు ఫైల్ చేసింది. ఆర్‌సీఎఫ్‌ఎల్‌పై కేసులో, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను రూ.57 కోట్లు మోసం చేసినందుకు మాజీ డైరెక్టర్లను బుక్ చేసింది. సీబీఐ ప్రకారం, ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ 18 బ్యాంకుల నుంచి రూ.5,572 కోట్లు, ఆర్‌సీఎఫ్‌ఎల్ 31 బ్యాంకుల నుంచి రూ.9,280 కోట్లు అప్పు తీసుకుంది.
ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ డిస్‌బర్స్ చేసిన రూ.12 వేల కోట్లలో 86శాతం నిధులు సంబంధిత సంస్థలకు (పొటెన్షియల్లీ ఇండైరెక్ట్లీ లింక్డ్ ఎంటిటీస్‌కు) వెళ్లాయని తేలింది. జై అన్మోల్, సుధాకర్ "రోజువారీ వ్యాపార నిర్ణయాలకు బాధ్యత వహించి, కుట్ర చేసి నిధులను దుర్వినియోగం చేశారు" అని యూనియన్ బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది.
