భారత క్రికెట్ చరిత్రలో 'జంబో'గా పిలవబడే ఆటగాడు అనిల్ కుంబ్లే. ఆయన కేవలం బంతిని తిప్పే లెగ్ స్పిన్నర్ మాత్రమే కాదు.. గ్రౌండ్ బయట కూడా అద్భుతమైన వ్యూహకర్త. రిటైర్మెంట్ తర్వాత చాలామంది క్రికెటర్లు కామెంటరీకో లేదా కోచింగ్కో పరిమితమౌతుంటారు. కానీ కుంబ్లే మాత్రం తనలోని ఇంజనీర్‌ను నిద్రలేపి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. 619 టెస్ట్ వికెట్ల వీరుడు ప్రస్తుతం సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా, ఇన్వెస్టర్‌గా ఎలా ఎదిగారో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కుంబ్లేకు చదువంటే చాలా ఇష్టం. 1990లో టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేస్తున్న సమయంలోనూ తన ఇంజనీరింగ్ పరీక్షల గురించి ఆలోచించేవారంటే చదువు పట్ల ఆయనకున్న ఇష్టం కనిపిస్తుంది. ఆ ఇంజనీరింగ్ బ్రెయిన్ క్రికెట్‌ను ఒక లెక్కలా చూసేలా చేసింది. అందుకే షేన్ వార్న్ లాంటి వారు బంతిని గాలిలో తిప్పితే.. కుంబ్లే మాత్రం పిచ్ మీద బంతి పడే కోణాన్ని, వేగాన్ని లెక్కిస్తూ వికెట్లు పడగొట్టేవాడు.
పాక్ పై 10 వికెట్ల స్ఫూర్తితో..
1999లో పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన కుంబ్లే.. తన కంపెనీకి అదే స్ఫూర్తితో టెన్విక్ అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక స్పోర్ట్స్ కంపెనీ మాత్రమే కాదు. రిటైర్డ్ ఆటగాళ్లకు కోచ్‌లుగా శిక్షణ ఇవ్వడం, స్కూల్ పిల్లలను స్పోర్ట్స్ వైపు మళ్లించడం ముఖ్య ఉద్దేశ్యం. 2025 నాటికి సుమారు 80వేల మంది పిల్లలు ఈ సంస్థలో భాగస్వాములయ్యారు. దీనితో పాటు టెన్విక్ రిటైల్ ద్వారా క్వాలిటీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా అమ్మటం ప్రారంభించారు కుంబ్లే.
బ్యాట్‌కు బుద్ధినిచ్చే స్పెక్టాకామ్..
కుంబ్లేలోని అసలైన ఇంజనీర్ 'స్పెక్టాకామ్' అనే స్టార్టప్‌లో కనిపిస్తారు. క్రికెట్ బ్యాట్‌పై ఒక చిన్న సెన్సార్ స్టిక్కర్ అతికించి.. దాని ద్వారా బ్యాట్ వేగం, పవర్, బంతి తగిలిన ఖచ్చితమైన ప్రదేశం వంటి డేటాను మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ద్వారా విశ్లేషిచారు. ఈ టెక్నాలజీని పవర్ బ్యాట్ అని పిలుస్తారు. బ్యాట్ బరువు పెరగకుండా, ఆటగాడికి ఇబ్బంది కలగకుండా డేటాను సేకరించడం కుంబ్లే మేధస్సుకే దక్కింది.
స్టార్టప్ ఇన్వెస్టర్‌గా 'జంబో' ఇన్వెస్ట్మెంట్స్..
కుంబ్లే కేవలం తన సొంత కంపెనీలకే పరిమితం కాలేదు. భవిష్యత్తు ఉన్న స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతూ స్ట్రాటజిక్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్నారు.
1. గరుడ ఏరోస్పేస్: వ్యవసాయం, ఇతర పనుల కోసం డ్రోన్లను తయారు చేసే ఈ సంస్థలో ధోనీతో కలిసి కుంబ్లే ఇన్వెస్ట్ చేశారు.
2. షాకా హ్యారీ: పర్యావరణంపై మక్కువతో ప్లాంట్-బేస్డ్ మీట్ స్టార్టప్‌లో కూడా కుంబ్లే ఇన్వెస్ట్ చేశారు.
3. ఆన్సూరిటీ: గిగ్ వర్కర్లకు తక్కువ ఖర్చులో హెల్త్ ఇన్సూరెన్స్ అందించే సంస్థకు గైడ్ చేస్తున్నారు.
అనిల్ కుంబ్లే నికర ఆస్తి విలువ సుమారు రూ.92 కోట్లుగా ఉంటుందని అంచనా. ఆయన బ్రాండ్ విలువ కేవలం సెలబ్రిటీ స్టేటస్ మీద కాకుండా.. క్రమశిక్షణ, నిజాయితీ మీద ఆధారపడింది. అందుకే కంపెనీలు ఆయనను ఇన్వెస్టర్‌గానే కాకుండా తమ మేనేజ్మెంట్ పాఠాలు నేర్పే గురువుగా చూస్తాయి. కుంబ్లే జర్నీ నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయం.. ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు మరో 'బ్యాకప్ ప్లాన్' ఉండటం బలహీనత కాదు అది అసలైన బలం అన్నదే. పట్టుదలే ఆయనను బోర్డ్ రూమ్‌లలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా నిలబెట్టింది.
