ద్రవిడ్ ఎంతో కష్టపడ్డాడు.. ప్రపంచ కప్ అందుకోవాడనికి అర్హుడు: భారత దిగ్గజ క్రికెటర్

ద్రవిడ్ ఎంతో కష్టపడ్డాడు.. ప్రపంచ కప్ అందుకోవాడనికి అర్హుడు: భారత దిగ్గజ క్రికెటర్

వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమి భారతీయులను కలచి వేస్తుంది. 12 ఏళ్ళ తర్వాత సొంతగడ్డపై ప్రపంచ కప్ జరగడం..ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా మన జట్టు ఫైనల్ కు వెళ్లడం..ఆటగాళ్లందరూ ఫామ్ లో ఉండడం.. ఇలా చాలా విషయాలు ట్రోఫీపై ఆశలు కలిగించాయి. కానీ అనుకున్నవేమీ జరగలేదు. ఫైనల్లో కనీసం పోటీ ఇవ్వకుండా కంగారూల జోరుకు చేతులెత్తేసింది. ఈ ఓటమి తర్వాత మాజీ కోచ్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే టీమిండియా  ట్రోఫీని దక్కించుకోలేకపోవడంపైన విచారం వ్యక్తం చేసాడు.
 
కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి అతని కష్టం గురించి మాట్లాడాడు. ద్రవిడ్ తన పాత్రను సమర్ధవంతంగా పోషించాడని.. అతడు టైటిల్ అందుకుంటే చూడాలని ఆశపడ్డానని తెలిపాడు. ఆటగాళ్ల మధ్య మంచి వాతావారణాన్ని సృష్టిస్తూ జట్టు విజయం కోసం పరితపిస్తాడని, ఫలితాలు ఎలా వచ్చినా 100 శాతం భారత జట్టు  గెలుపు కోసం ఆరాటపడతాడని ఈ మాజీ స్పిన్ దిగ్గజం పేర్కొన్నాడు. 

ఇక కోహ్లీ, రోహిత్ గురించి స్పందిస్తూ వీరిద్దరూ టోర్నీ అంతటా టీమిండియాను ముందుండి నడిపించారని.. ఇద్దరు పోటీపడి పరుగులు చేసిన తీరు అద్భుతం అని చెప్పుకొచ్చాడు. రోహిత్ ప్రతి మ్యాచ్ లో మంచి ఆరంభాలు ఇస్తే కోహ్లీ చివరి వరకు క్రీజ్ లో ఉండి భారత్ కు భారీ స్కోర్ అందించారని.. వీరిద్దరూ ట్రోఫీ అందుకోలేకపోవడం చాలా నిరాశకు గురి చేసిందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. 

ఈ సందర్భంగా వరల్డ్ కప్ ఫైనల్లో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. సూర్య కుమార్ యాదవ్ ఒక స్పెషలిస్ట్ బ్యాటర్.. అతన్ని జడేజా కంటే బ్యాటింగ్ ఆర్డర్ లో ఆరో స్థానంలో పంపాల్సింది. బిగ్ ఫైనల్ ఆడేటప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయడం అనవసరమని కుంబ్లే వ్యాఖ్యానించాడు.