ఢిల్లీకి పిలిచి టార్చర్ చేయడంపై అంజన్​ కుమార్​ ఆగ్రహం

ఢిల్లీకి పిలిచి టార్చర్ చేయడంపై అంజన్​ కుమార్​ ఆగ్రహం

న్యూఢిల్లీ, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్​కు విరాళాలు ఇచ్చినట్లు ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కి తెలిపానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు. యంగ్ ఇండియా లిమిటెడ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందనే విరాళాలు ఇచ్చానని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో బుధవారం ఢిల్లీలోని ఈడీ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:40 దాకా ఈడీ అధికారులు ఆయనను విచారించారు. ప్రధానంగా పీఎంఎల్ఏ సెక్షన్ 50ఏ ప్రకారం అధికారులు అంజన్ స్టేట్మెంట్ ను రికార్డు చేసినట్లు తెలిసింది.

విచారణ అనంతరం మీడియాతో అంజన్  మాట్లాడారు. యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు విరాళంగా రూ. 20 లక్షలు ఇచ్చానని, ఈ విరాళంపై ఈడీ తనను ప్రశ్నించిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఆ విరాళం ఇచ్చానని చెప్పారు. మళ్లీ విచారణ ఉంటే పిలుస్తామని ఈడీ అధికారులు తనకు తెలియజేశారని అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు కాంగ్రెస్ నేతలను విచారిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏమీలేని దానికి తనను ఢిల్లీకి పిలిచి టార్చర్ చేయడం సరికాదని ఆయన ఫైరయ్యారు. అయితే, ఇదే కేసుకు సంబంధించి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అనిల్ కుమార్​ల స్టేట్మెంట్లను ఈడీ ఇప్పటికే రికార్డు చేసింది. వారి కంటే ముందే గత నెల 3న అంజన్ కుమార్ యాదవ్ ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా... అనారోగ్యం కారణంగా ఆయన హాజరు కాలేదు. దాదాపు 5 నెలల క్రితం రాష్ట్రానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇండియా లిమిటెడ్ కు దాదాపు రూ. 20 లక్షల చొప్పున చెక్ సమర్పించినట్లు సమాచారం.