ఐదుగురు ఐపీఎస్​ల బదిలీ.. సీఐడీ చీఫ్‌‌గా మహేశ్ భగవత్‌‌

ఐదుగురు ఐపీఎస్​ల బదిలీ.. సీఐడీ చీఫ్‌‌గా మహేశ్ భగవత్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ఇన్ చార్జ్ డీజీపీగా అంజనీకుమార్‌‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆయనను ఇన్ చార్జ్ డీజీపీ  (ఫుల్ అడిషనల్ చార్జ్) గా నియమిస్తూ సీఎస్‌‌ సోమేశ్‌‌కుమార్‌‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుత డీజీపీ మహేందర్‌‌రెడ్డి ఈ నెల 31 రిటైర్ కానుండడంతో అంజనీకుమార్‌‌కు ఇన్ చార్జ్ డీజీపీగా బాధ్యతలు అప్పగించారు. దీంతో పూర్తిస్థాయి డీజీపీ నియామకం జరిగే వరకు అంజనీకుమార్‌‌ తాత్కాలిక డీజీపీగా కొనసాగనున్నారు. గతంలో అనురాగ్‌‌ శర్మ, మహేందర్‌‌‌‌ రెడ్డిని కూడా మొదట తాత్కాలిక డీజీపీలుగా నియమించారు. అనంతరం పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అంజనీకుమార్ ను కూడా అలాగే నియమించే అవకాశం ఉంది. కాగా, మరో ఐదుగురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాను ఏసీబీ, విజిలెన్స్‌‌, జైళ్ల శాఖ డీజీగా నియమించారు. ఆయన స్థానంలో అడిషనల్ డీజీపీ(లా అండ్ ఆర్డర్‌‌‌‌) జితేందర్‌‌కు పోస్టింగ్‌‌ ఇచ్చారు. ఫైర్ సర్వీసెస్‌‌ డీజీగా ఉన్న సంజయ్‌‌ కుమార్‌‌ జైన్‌‌కు అడిషనల్‌‌ డీజీ (లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌)గా బాధ్యతలు అప్పగించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌‌ను సీఐడీ చీఫ్‌‌గా ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేశారు. ఆయన స్థానంలో సిటీ (లా అండ్‌‌ ఆర్డర్‌‌)‌‌ జాయింట్‌‌ సీపీగా విధులు నిర్వహించిన దేవేంద్ర సింగ్‌‌ చౌహాన్‌‌ను నియమించారు. 
మరికొంత మంది ఐపీఎస్‌‌‌‌లనూ బదిలీ చేసేం దుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సంక్రాంత్రికి ముందు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 

1990 బ్యాచ్ ఆఫీసర్.. 

బీహార్‌‌‌‌లోని‌‌‌‌ పట్నాలో 1966 జనవరి 28న పుట్టిన అంజనీ కుమార్‌‌‌‌.. 1990 బ్యాచ్‌‌‌‌ ఐపీఎస్‌‌‌‌ ఆఫీసర్. ఉమ్మడి ఏపీలో వరంగల్‌‌‌‌ జిల్లా జనగాం ఏఎస్పీగా మొదటి పోస్టింగ్‌‌‌‌ తీసుకున్నారు. నిజామాబాద్‌‌‌‌, గుంటూరు రేంజ్‌‌‌‌ డీఐజీగా పని చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీగా సేవలందించారు. సెంట్రల్ కు డెప్యుటేషన్ పై వెళ్లి సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ ఏఐజీగా, 1998-–-99 మధ్య మన దేశం తరఫున యూఎన్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌(ఐపీటీఎఫ్‌‌‌‌)లో  పని చేశారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌‌‌‌ సిటీ అడిషనల్‌‌‌‌ సీపీ(లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌)గా విధులు నిర్వహించారు. గ్రేహౌండ్స్‌‌‌‌ చీఫ్‌‌‌‌గా పని చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక 2016-–-18 మధ్య అడిషనల్‌‌‌‌ డీజీపీ( లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌) గా సేవలందించారు.  2018–--2021 మధ్య హైదరాబాద్‌‌‌‌ సిటీ సీపీగా పని చేశారు. పోయినేడాది డిసెంబరు 25 నుంచి ఏసీబీ డీజీగా ఉన్నారు.