సమ్మె విరమించనున్న ఏఎన్​ఎంలు.. డీహెచ్‌ శ్రీనివాస రావుతో చర్చలు సఫలం

సమ్మె విరమించనున్న ఏఎన్​ఎంలు.. డీహెచ్‌ శ్రీనివాస రావుతో చర్చలు సఫలం
  • 4వ తేదీకల్లా కమిటీ వేస్తామని హామీ
  • ఒప్పంద పత్రాలపై సంతకాలు

హైదరాబాద్, వెలుగు: సమ్మెలో ఉన్న కాంట్రాక్ట్‌‌‌‌ ఏఎన్‌‌‌‌ఎంలతో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఏఎన్‌‌‌‌ఎంల డిమాండ్లను నెరవేర్చేందుకు ఉన్న మార్గాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేయాలని ఏఎన్‌‌‌‌ఎంలు కోరగా, ఇందుకు డీహెచ్‌‌‌‌ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 4వ తేదీకల్లా కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. కమిటీ ఉత్తర్వులు అధికారికంగా వెలువడిన వెంటనే సమ్మె విరమిస్తామని ఏఎన్‌‌‌‌ఎంలు ప్రకటించారు. 

ఈ మేరకు శుక్రవారం ఇరువర్గాలు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. తమ సర్వీస్‌‌‌‌ను రెగ్యులరైజ్‌‌‌‌ చేయడం, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఆగస్టు 15 నుంచి కాంట్రాక్ట్ ఏఎన్‌‌‌‌ఎంలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వ సూచనతో ఇప్పటికే పలుమార్లు వారితో చర్చలు జరిపిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్ గడల శ్రీనివాసరావు, శుక్రవారం మరోసారి వారిని చర్చలకు ఆహ్వానించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఆర్‌‌‌‌‌‌‌‌టీయూ తదితర సంఘాల లీడర్లు, కాంట్రాక్ట్ ఏఎన్‌‌‌‌ఎంలు డీహెచ్‌‌‌‌తో ఆయన ఆఫీసులో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో కాంట్రాక్ట్ ఏఎన్‌‌‌‌ఎంలకు మంచి వేతనాలను చెల్లించడంతో పాటు, అన్ని రకాలు సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నదని డీహెచ్‌‌‌‌ వారికి వివరించారు. 

ఏఎన్‌‌‌‌ఎంల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని, సమ్మె విరమించాలని డీహెచ్‌‌‌‌ కోరారు. డిమాండ్ల అమలు సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీహెచ్‌‌‌‌ వారికి తెలిపారు. ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించిన లీడర్లు, ఏఎన్‌‌‌‌ఎంలు, కమిటీ వేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే సమ్మె విరమించేందుకు ఒప్పుకున్నారు. ఈ నెల 4వ తేదీ నాటికల్లా కమిటీ వేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని డీహెచ్ వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒప్పంద పత్రం రాసుకుని ఇరువర్గాలు సంతకాలు చేశారు. ఏఐటీయూసీ నుంచి ఎం.నర్సింహ్మా, సీఐటీయూ నుంచి భూపాల్, బీఆర్‌‌‌‌‌‌‌‌టీయూ నుంచి అనురాధ, తదితర సంఘాల నాయకులు, ప్రతినిధులు డీహెచ్‌‌‌‌ శ్రీనివాసరావుతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.